రాజధాని అమరావతి పరిరక్షణ సమితి జెఏసికి ఎకరం భూమి విరాళం

August 02, 2020

కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి తన తండ్రినుంచి సంక్రమించిన భూమిలో ఎకరం భూమిని అమరావతి పరిరక్షణ జెఏసికి విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఎన్టీఆర్ భవన్ కు తన కుటుంబంతో కలిసివచ్చి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును కలిసి భూవిరాళం ఇస్తున్నట్లు పేర్కొంది.
గతంలో రాజధాని నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందించిన విషయం విదితమే. 9వ తరగతి బాలికగా ఉంటూ తన పాకెట్ మనీ రూ.లక్ష విరాళం ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ అప్పట్లో ఆమెను ‘అమరావతి అంబాసిడర్’ గా చంద్రబాబు ప్రకటించారు కూడా..విద్యార్ధిగా ఉంటూనే 2పాఠశాలల అభివృద్దికి రూ.4లక్షలు అందించడం, 400మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆమె కృషి చేయడాన్ని అప్పట్లో అభినందించారు.
ప్రస్తుతం రాజధాని అమరావతి తరలింపుపై ప్రజల్లో గందరగోళం, 3రాజధానుల ప్రకటన ద్వారా అయోమయం నెలకొన్న నేపథ్యంలో వైష్ణవి తన కుటుంబ సభ్యులతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చింది. అమరావతి పరిరక్షణకు ముదినేపల్లిలో ఈ నెల 12న దుర్గా మహా చండీయాగం నిర్వహిస్తున్నామంటూ, దానికి హాజరు కావాలని చంద్రబాబును కోరారు.
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకోవడం రాష్ట్రంలోని 13జిల్లాలకు చెందిన 5కోట్ల ప్రజల బాధ్యతగా పేర్కొన్నారు. సోమవారం టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దీక్ష సందర్భంగా పలువురు మహిళలు స్పందించి చేతిగాజులు, గొలుసులు, ఉంగరాలు ఇతర ఆభరణాలను విరాళంగా అందించడం రాజధాని అమరావతి పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవిత్రభావానికి నిదర్శనం అన్నారు. ఒక్క గంటలో జెఏసికి రూ.25లక్షలు విరాళాలు ఇవ్వడం సంకల్ప బలాన్ని తెలియజేస్తోంది అన్నారు. ఇప్పుడు ఇంటర్ విద్యార్ధిని వైష్ణవి ఏకంగా ఎకరం భూమి విరాళం ఇవ్వడం గొప్ప విషయంగా చంద్రబాబు అన్నారు.
‘‘మై బ్రిక్ - మై అమరావతి’’కి అప్పట్లో అనేకమంది ముందుకొచ్చి రూ.55కోట్ల విరాళాలు ఇటుకల రూపంలో ఇచ్చిన విషయం గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13వేల గ్రామాలు, 3వేల వార్డులనుంచి ‘‘మన మట్టి-మన నీళ్లు-మన అమరావతి’’ కింద పుట్టమట్టిని, పవిత్రజలాలను తెచ్చి అమరావతి శంకుస్థాపనలో ప్రధాని నరేంద్రమోడి ఢిల్లీనుంచి తెచ్చిన పార్లమెంట్ మట్టి, యమునా జలాలతో కలిసి అభిషేకించి ఈ ప్రాంతాన్ని శక్తి సంపన్నం చేసిన విషయం ప్రస్తావించారు.
‘‘సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్’’ ఉద్యమం రాష్ట్రం యావత్తూ అన్ని గ్రామాల్లో, వార్డుల్లో ఉధృతంగా జరగాలని ఆకాంక్షించారు. అప్పుడే ఆయా గ్రామాల నుంచి తెచ్చిన పుట్ట మట్టి, పవిత్ర జలాలకు సార్ధకత ఉంటుందని అన్నారు. రాజధాని అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత 5కోట్ల ప్రజలపై ఉందన్నారు.