ఏడుగురికి ఒకే వెంటిలేటర్.. అమెరికాలో ప్రయోగం

June 04, 2020

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ అగ్ర దేశాలు సైతం అల్లకల్లోలమైపోతున్నాయి. ఆసుపత్రులు, వైద్యులు, పరికరాలు చాలక దేశాలన్నీ నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాయి. ఇలాంటి తరుణంలో కొన్ని చోట్ల కొత్తకొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి.. మరికొందరు చిన్నపాటి మార్పులతో ఉన్నపరికరాలను మరింత విస్తృతంగా వాడుకునేలా చేయగలుగుతున్నారు. అమెరికాలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కోవిడ్ రోగులు ఉండడంతో అక్కడ వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అక్కడి వైద్యులు కొందరు దీనికి పరిష్కారం వెతికారు. ఒకే వెంటిలేటరుతో ఏడుగురికి శ్వాస అందించే మార్గం కనిపెట్టారు. స్వయంగా శ్వాసకోశ వ్యాధుల నిపుణుడైన సెనేటర్ సవూద్ అన్వర్, ఇంజినీర్ రాబర్ట్ కోన్లీ, తయారీరంగ నిపుణుడు కెవిన్ డయ్యర్ కలిసి దీన్ని తయారుచేశారు.
కెవిన్ డయ్యర్ 3డీ ప్రింటింగులో నిష్ణాతుడు.. ఆయనొక రోజు ఇంజినీర్ రాబర్ట్ కోన్లీకి ఫోన్ చేసి వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది.. మనమేదైనా చేయాలి.. ఒక్క వెంటిలేటరుతో ఎక్కువ మంది పేషెంట్లకు శ్వాస అందించే ఉపాయం ఆలోచిద్దాం అన్నారు. అనుకున్నదే తడవుగా ఒకే వెంటిలేటరు నుంచి ఏడు పైపులు అమర్చి ఏడింటిలోనూ సమానంగా ఆక్సిజన్, పీడనం ప్రసరించే ఏర్పాటు చేశారు.
అయితే.. ఇది సాధారణ పరిస్థితుల్లో కాకుండా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొరత ఉన్నప్పుడే వాడాలని సెనేటర్ డాక్టర్ అన్వర్ అంటున్నారు. అయితే, వైద్యరంగ నిపుణులు కొందరు ఇది సరైన పద్ధతి కాదంటున్నారు. మరోవైపు ఇంకొందరు మాత్రం పూర్తిగా వెంటిలేటర్లు లేకుండా రోగుల ప్రాణాలను గాలికొదిలేసే కంటే ఇది నయమని చెబుతున్నారు. అయితే... డయ్యర్ మాత్రం తాను దీనికి పేటెంట్ తీసుకునే ఆలోచనలో లేనని.. 3డీ ప్రింటింగులో ఏ దేశస్థులైనా దీన్ని ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.