జగన్ కి ఏడాది: మెరుపులు తక్కువ, మరకలు ఎక్కువ

August 04, 2020

2019 సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లకు గాను ఏకంగా 151 సీట్లు గెలుచుకోవడం ద్వారా జగన్ రికార్డ్ సృష్టించారు. గెలుపు కారణాలు ఏవైనప్పటికీ కోట్లాది మంది ప్రజలు పెట్టుకున్న ఆశలను ఇప్పుడు జగన్ నిర్వీర్యం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా ఏడింట దాదాపు ఆరొంతుల మెజార్టీ ఎలాగైతే దక్కించుకున్నారో అంతే వేగంగా ఆయన ప్రతిష్ట మసకబారుతోందంటున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతీకారం నుండి కోర్టు మొట్టికాయలు వరకు ప్రతి అడుగు ప్రజలను ఏమాత్రం మెప్పించేలా కనిపించడం లేదంటున్నారు.

కేవలం ప్రతిపక్షం పైనే కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారనే అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏడాదా కాలంలోనే జగన్ ఘోరమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నాడని చెబుతున్నాయి. జగన్ తన మార్గంలోనే వెళ్తారని, ఎవరు చెప్పినా వినరనే ఆరోపణ చాలా రోజులుగా ఉన్నాయి. కొండా సురేఖ, జీవిత-రాజశేఖర్ వంటి వారు గతంలో ఈ రకమైన విమర్శలు చేశారు. అయితే పార్టీలోనే కాదు.. అధికారంలోకి వచ్చాక కూడా అలాగే ఉందంటున్నారు.

అధికారంలోకి రావడానికి నవరత్నాల వంటి హామీలు ఉపయోగపడ్డాయి. దశలవారీగా మద్య నియంత్రణ, అనేక పథకాలకు సంబంధించి నేరుగా డబ్బులు ఖాతాదారులకే వేయడం వంటివి ప్రజలకు మరింత దగ్గర చేసేవే. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఉద్యోగ కల్పన, లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు కల్పించడం మంచి ఆలోచనగా చెబుతున్నారు. అయితే వివాదాస్పద నిర్ణయాలు ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తున్నాయనే వాదనలు ఉన్నాయి.

పేదలకు రూ.5కే కడుపు నింపే అన్న క్యాంటీన్లు రద్దు చేయడం, ఇసుకను కొంతకాలం రద్దు చేయడం, విద్యుత్ ఒప్పందాల సమీక్ష అంశం గత ఏడాది జాతీయంగా, అంతర్జాతీయంగా విమర్శలకు తావిచ్చాయి. కొత్త రాష్ట్రమైనప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ టీడీపీ హయాంలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు. కానీ జగన్ అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా మద్యం దుకాణాలు ఎత్తేస్తామని హామీ ఇచ్చిన జగన్‌కు కరోనా రూపంలో మంచి అవకాశం వచ్చింది. దాదాపు నెల పదిహేను రోజుల పాటు ప్రజలు లిక్కర్ ముట్టుకునే అవకాశం కోల్పోయారు. దీనిని జగన్ అలాగే కొనసాగిస్తే మంచి మార్కులు పడేవని చెబుతున్నారు. దశరవారీగా అని హామీ ఇచ్చినప్పటికీ.. మంచి అవకాశం కోల్పోయారంటున్నారు. అంతేకాదు, ఒప్పందం కుదుర్చుకున్న బ్రాండ్స్ మాత్రమే అమ్మడం వల్ల నెలకు ముడుపుల ఆరోపణలు వచ్చాయి.

ఇక, ఎన్నికలకు ముందు వరకు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబును పదేపదే ప్రశ్నించిన జగన్ ఇప్పుడు మౌనంగా ఉండిపోయారని అంటున్నారు. 20 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పారని, కానీ కనీసం హోదా మాట ఎత్తడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత టర్మ్‌లో రాజీనామాలకు సిద్ధపడ్డ వైసీపీ ఇప్పుడు మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకున్నారని చెబుతున్నారు.

జగన్ హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చర్చి ఫాదర్లు, మసీదు ముల్లాలకు గౌరవ వేతనం ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఆలయాల నుండి పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ఆదాయం రాని వాటికి గౌరవం వేతనం ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో అమ్మవారి విగ్రహాల కూల్చివేతపై హిందుత్వ అభిమానులు మండిపడ్డారు. పవిత్ర సంగమంలో హారతి రద్దు, దేవాలయల భూముల అమ్మకం, ఘాట్ల వద్ద పిండాలకు ధరలు పెంచడం వంటి విధానాలు హిందూ వ్యతిరేక ముద్రను తీసుకు వస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన సమయంలోను పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు టీటీడీ నిరర్థక ఆస్తులను అమ్మాలని చూడటంపై బీజేపీ, హిందుత్వ అభిమానులు గుర్రుగా ఉన్నారు.

రాజధాని అమరావతిని విశాఖకు తరలించడం.. మూడు రాజధానుల అంశంపై భగ్గుమంటున్నారు. రాజధాని మార్పు, చంద్రబాబు నివాసం కూల్చివేత అంశం, అమరావతి భూముల్లో అక్రమాల గురించి మాట్లాడినా.. ఏడాది గడిచినా ఎలాంటి ఆధారాలు వెలికితీయకపోవడం, విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష వంటి అంశాలు కేవలం చంద్రబాబుపై ప్రతీకారం కోసమే అన్న వాదనలు వినిపించాయి. టీడీపీ అధినేతపై ప్రతీకారం కోసం రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారనేది విపక్షాల వాదన.

నిజాయితీపరుడిగా పేరున్న ఎల్వీ సుబ్రమణ్యంపై వేటు, కరోనా సమయంలో ఎన్నికల రద్దు ద్వారా ప్రజలను కాపాడారని ప్రశంసలు అందుకున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు అంశాలు మచ్చ అంటున్నారు. నిఘా దళపతిగా చేసిన ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెండ్ చేయడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు.

ప్రధానంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై హైకోర్టు వరుసగా మొట్టికాయలు వేస్తోంది. దాదాపు అరవైసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు లేదా వ్యాఖ్యలు వచ్చాయని చెబుతున్నారు. డీజీపీ రెండుసార్లు కోర్టు మెట్లు ఎక్కారు. వ్యతిరేకంగా వ్యాఖ్యలు లేదా తీర్పులు వస్తే న్యాయస్థానాలపై కూడా సోషల్ మీడియాలో బురద చల్లడం గమనార్హం. రాజకీయంగా ప్రతిపక్షం నుండి అధికారులు, ఈసీ, కోర్టు సహా వివిధ పాలనాపరమైన నిర్ణయాల వరకు ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడమే మార్గంగా ఎంచుకున్నారని విపక్షాలు భగ్గుమంటున్నాయి. గతంలో సోషల్ మీడియా కోసం గొంతెత్తిన వైసీపీ, ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తోందంటున్నారు. మీడియాపై కూడా అణిచివేత ధోరణి అవలంభిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జగన్ తీరుపై జాతీయ మీడియా కూడా నిలదీస్తున్న వైనం ఉందంటున్నారు.