జగన్ vs చంద్రబాబు.. తొలి ఏడాది పాలన

August 11, 2020

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. ఏడాది కాలంలో వైసీపీ ప్రభుత్వం ప్రశంసల కంటే విమర్శలు, హైకోర్టు మొట్టికాయ, వివాదాస్పద నిర్ణయాలకే ఎక్కువగా పరిమితమైందనే వాదనలు ఉన్నాయి. అదే సమయంలో గత చంద్రబాబు నాయుడు పాలన 2015-15లో మొదటి ఏడాది, జగన్ 2019-20 తొలి ఏడాదిలో ఏపీకి వచ్చిన పెట్టుబడుల, ప్రాజెక్టులపై చర్చ సాగుతోంది. ఏపీ కొత్త రాష్ట్రం. పైగా రాజధాని కూడా లేదు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు, త్వరితగతిన ప్రాజెక్టుల పూర్తి ఎంతో ముఖ్యం. 

పెద్ద పెద్ద పెట్టుబడులు వెంటనే రావు. వాటికి ఎన్నోసార్లు ఫాలోఅప్ చేస్తే కానీ రాష్ట్రానికి రావు. చంద్రబాబు హయాంలో పెట్టుబడులు ఇలా... హీరో మోటార్స్ పెట్టుబడుల కోసం 2014 సెప్టెంబర్ నుండి నాటి చంద్రబాబు పాలన ఫాలోఅప్ ప్రారంభించింది. ఏషియన్ పేయింట్స్, మిలాన్ వంటి సంస్థలు ఆ తర్వాత పెట్టుబడులు పెట్టాయి.  మరిన్ని సంస్థలు కూడా వచ్చాయి. మొదటి నుండి సంప్రదింపుల జరపడం ద్వారా 2014-19 మధ్య ఏపీకి రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు, మూడున్నర లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే చెప్పింది.

అదే 2019-20 మధ్య ఒక్క పెద్ద పెట్టుబడి రాలేదని, పైగా రిలయన్స్, అదాని, లూలు గ్రూప్ వంటి పెద్ద పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాది పట్టిసీమను ప్రారంభించి పూర్తి చేసింది. జగన్ ప్రభుత్వం పాత ప్రాజెక్టులు నిలిపివేయడంతో పాటు కొత్త ప్రాజెక్టు ఒక్కటి లేదని గుర్తు చేస్తున్నారు. తొలి ఏడాదిలోనే అమరావతిలో 33వేల ఎకరాలు సమీకరించి రాజధాని ప్రారంభించడం, విశాఖలో సిగ్నేచర్ టవర్స్‌కు ప్లాన్ చేశాయి. జగన్ ప్రభుత్వంలో కూల్చివేతలు, వైసీపీ రంగులు వేసుకోవడం తప్ప ఇంకేమీ లేదని చెబుతున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం నాడు తొలి వంద రోజుల్లోనే భారీ విద్యుత్ లోటును అధిగమించింది. ఆ తర్వాత మిగులు విద్యుత్ అమ్మకాలు కూడా ప్రారంభించింది నాటి ప్రభుత్వం. కానీ జగన్ ప్రభుత్వంలో తొలి ఏడాది పీపీఏల ఆందోళనలు, కరెంట్ ఛార్జీల మోత చూస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాది నుండే చెట్లు నాటించడం, టాయిలెట్లు నిర్మించడం చేసింది. నాడు అటవీ అభివృద్ధిలో కూడా ముందు నిలిచింది. శాంతిభద్రతల విషయంలోను చంద్రబాబు హయాంలో బేష్‌గా ఉందని గుర్తు చేస్తున్నారు.

సంక్షేమ పథకాల కోసం చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో లక్షా ఆరువందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే, జగన్ ప్రభుత్వం సంవత్సరంలోనే ఎనభై వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని, అలాగే వేలకోట్ల రూపాయల భూములను అమ్మకాలకు పెట్టిందని గుర్తు చేస్తున్నారు. 2015లో దేశమంతా రాష్ట్రం గురించి మాట్లాడుకుందని, ఐదేళ్లలో చంద్రబాబు ఏపీ బ్రాండ్‌ను పెంచారని, కానీ ఇప్పుడు జగన్ హయాంలో ఏడాది కాలంలోనే ఏపీ బ్రాండ్ వ్యాల్యూ కోల్పోయామని అంటున్నారు.