చిందర‘వంద’రా... జగన్ 100 రోజుల పాలన ఫుల్ రిపోర్ట్

February 27, 2020

తెలుగునాట వీధివీధినా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీని ఎన్నికల రాజకీయంలో గట్టి దెబ్బతీసి.. నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చంద్రబాబు వంటి నేతకు మునుపెన్నడూ లేని స్థాయి ఓటమితో షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక పాలనలో అలాంటి ముద్ర చూపించలేకపోతుందన్న విశ్లేషణలు అంతటా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 100 రోజుల పాలన పూర్తిచేసుకున్న వైసీపీ అధినేత జగన్ 100 మార్కులు కాదు కదా పాస్ మార్కులు కూడా సాధించలేకపోయారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్  100 రోజుల పాలనపై ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీలు దుమ్ముదులిపేశాయి.. మరోవైపు పలువురు పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు కూడా జగన్ 100 రోజుల పాలనను పోస్ట్ మార్టం చేసి విశ్లేషించి నివేదికలు వెలువరించారు. అలాంటి ఒక నివేదిక ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
తాను పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు కానీ, జగన్‌పై జనం ఆశలు పెట్టుకోవడానికి ప్రధాన కారణమైన నవరత్నాల అమలు దిశగా కానీ వేగం చూపని జగన్ పూర్తిగా గత ప్రభుత్వంలో చేపట్టిన పనులను రివ్యూ చేయడం... రాష్ట్రంపై చంద్రబాబు ముద్ర కనిపించకుండా చేయాలన్న తాపత్రయం తప్ప ప్రజల కష్టాలు ఆయనకు పట్టడం లేదన్న విమర్శలు ఈ నివేదికల్లో కనిపిస్తున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ విచారణలపర్వం కొనసాగిస్తున్న జగన్ ఇంతవరకు చంద్రబాబుకానీ, ఆయన తనయుడు లోకేశ్ కానీ, చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు కానీ అవినీతికి పాల్పడినట్లు నిరూపించలేకపోయింది. కనీసం ఆధారాలు కూడా సేకరించలేకపపోయింది.
అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నా గత ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికీ తేడాను అవి చూపించలేకపోతున్నాయి. పైగా జనం చంద్రబాబు హయాంతో పోల్చుకుంటే ఆ పాలనే నయమనే పరిస్థితికి వస్తున్నారని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు పాలనలో హడావుడి, హంగామా, ఆర్భాటం, భారీతనం, ప్రదర్శనా నైజం వంటివి ఉన్నప్పటికీ ప్రజలే ప్రథమ ప్రాధాన్యం అనే సూత్రం ప్రతి నిమిషం కనిపించేందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
జగన్ పాలనలో కొట్టొస్తున్నట్లు కనిపిస్తున్నవి ఇవీ..
* శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, మంత్రులు-అధికారుల మధ్య సమన్వయలేమి, మంత్రుల అనుభవ రాహిత్యం, ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పెరిగిపోయిన నిర్లక్ష్యం, ఉదాసీనత
* ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర పేరుతో ఏడాదిన్నర కాలం ప్రజల మధ్యే గడిపి వారి తల నిమిరి, చెంపలు నిమిరి ప్రజా నాయకుడన్న ముద్ర వేయించుకున్న జగన్ సీఎం అయిన తరువాత ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన్ను కలవడానికి వచ్చినవారు నిరాశగానే వెనుదిరగాల్సిన పరిస్థితి.
* సీఎంకు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, పీఏ కేఎన్నార్, సీఎం కార్యాలయ కార్యదర్శి ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, సలహాదారు ట్రంప్ అవినాశ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్నారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ మాత్రమే నేరుగా కలిసే పరిస్థితుల్లో ఉన్నారు. వీరిలో కేఎన్నార్, ట్రంప్ అవినాశ్, ధనుంజయ్ రెడ్డి, గౌతమ్ సవాంగ్, కృష్నమోహన్ రెడ్డి మాత్రమే రోజువారీ కలుస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది వీరిద్వారా జగన్‌కు పూర్తిస్థాయిలో చేరడం లేదని చెబుతున్నారు.

కోటరీతో నష్టాలిలా..
1) ఈ కీలకమై కోటరీలో కృష్ణమోహన్ రెడ్డికి మంచివారన్న పేరుంది. అయితే, ఏదీ గట్టిగా చెప్పలేరు, మొహమాటస్థుడు కావడంతో జగన్ దృష్టికీ ఏమీ తీసుకెళ్లలేరు. దాంతో వాస్తవాలు ఆయన ద్వారా తెలిసే అవకాశం లేదు.
2) కేఎన్నార్ చురుకైన వ్యక్తే అయినప్పటికీ లౌక్యం, చాకచక్యం ఎక్కువంటారు. అందుకే ఆయన నిజాలు చెప్పి నిష్ఠూరాలు పడాలని అనుకోరట. సో.. ఆ చానల్ నుంచి కూడా జగన్‌కు వాస్తవాలు తెలిసే అవకాశం లేదు.
3) మూడో వ్యక్తి ట్రంప్ అవినాశ్. జగన్‌కు అత్యంత నమ్మకస్తుడు. నిజాయితీపరుడన్న పేరుంది. రాజకీయ అంశాలన్నీ ఆయన ద్వారానే జగన్‌కు చేరుతాయట. డీజీపీ నుంచి రోజూ బ్రీఫింగ్ తీసుకుని జగన్‌కు చేర్చుతారు.
4) అయితే, డీజీపీ గౌతం సవాంగ్ నుంచి వాస్తవాలు తెలుస్తాయా అన్నదే సమస్యని విశ్లేషకులు అంటున్నారు. సవాంగ్ టీడీపీ అనుకూల అధికారని.. ఆయనకు ఇప్పటికీ టీడీపీ ఫస్ట్ లేయర్ నాయకత్వంతో మంచి సంబంధాలున్నాయని చెబుతారు. టీడీపీ పట్ల ఆయన సాఫ్ట్ గా ఉంటారంటారు.


నిఘా ఇంకా నిద్రలోనే..
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పార్టీలో పరిణామాలు, ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉంది వంటివన్నీ నిఘా వర్గాల నుంచే సీఎం వరకు చేరాలి. కానీ, అది పక్కాగా జరగడం లేదని చెబుతున్నారు. అందుకు కారణం నిఘా విభాగానికి నాథుడు లేకపోవడమేనని చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిఘా విభాగాధిపతిగా ఉన్న అధికారి తెలంగాణకు వెళ్లిపోవడంతో ఆ శాఖ ఇప్పుడు దిక్కులేకుండా ఉంది.

మంత్రివర్గంతో వన్ వే మీటింగ్స్..
మంత్రుల్లో అత్యధికులు కొత్తవారు, జగన్ దయతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అయినవారే కావడంతో వారంతా జగన్ నామ స్మరణ ఎప్పుడెప్పుడు చేద్దామా అని చూడడమే తప్ప వాస్తవ పరిస్థితులు, క్షేత్ర స్థాయి విషయాలు ముఖ్యమంత్రికి చెప్పి అలర్ట్ చేసేలా లేరు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రమే మంత్రివర్గంలో జగన్‌కు అత్యంత సన్నిహితులు, ఆయనకు ఏమైనా చెప్పగలిగేవారు. వీరిలో బుగ్గన.. జగన్ పిలిస్తేనో, కలవాల్సిన పనుంటేనో వెళ్తుంటారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకు అనుకునే రకం. అడిగితే తప్ప ఓపెన్ కారంటుంటారు. పెద్దిరెడ్డి కాస్త చొరవ తీసుకుని చెప్పగలిగే పరిస్థితిలో ఉంటారని ఆ పార్టీ వ్యవహారాలు సుదీర్ఘ కాలంగా చూస్తున్న సీనియర్ పాత్రికేయులు చెబుతున్నారు. దీంతో మంత్రివర్గం, సీఎం కలిసికట్టుగా పనిచేయడం లేదని.. సమావేశాలు జరుగుతున్నా ఏకపక్షంగా సాగుతున్నాయని చెబుతున్నారు.

అధికారులతో మరో సమస్య..
ఇక చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. జగన్ మాటలను ఆయన ఒకింత లెక్కచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం తనను నియమించిందన్న లెక్కతో ఆయన స్వతంత్రంగా ఉంటున్నారట.
ఇక సీఎం కార్యాలయంలోని ఆరుగురు కీలక అధికారుల్లో నలుగురు రిటైరైనవారు.
వారిలో ముఖ్యుడు అజేయ కల్లం. గతంలో సీఎస్‌గా పనిచేసి రిటైరయ్యారు. కానీ, మెతక వైఖరి వల్ల పట్టుసాధించలేకపోతున్నారట. పైగా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యానికి, ఆయనకు పొసగడం లేదని చెబుతున్నారు.
మరో అధికారి ధనుంజయ్ రెడ్డిని సీఎం ఏరికోరి తెచ్చుకున్నారు. ఈయన నమ్మినబంటు అంటారు. సమర్థుడే అయినా పనిభారం అధికం కావడం, ఎక్కువగా ముఖ్యమంత్రి వెంటే ఉండాల్సి రావడంతో అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగింలేకపోతున్నారట.
పీవీ రమేశ్, శామ్మూల్‌లకు సీఎంవోలోని మిగతావారితో కుదరడం లేదట. మరో అదికారి జె.మురళి రిటైరైన అదికారి. ఎక్స్‌టెన్సన్ ఇచ్చారు. ఈయన మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలకు సన్నిహితుడు.
మరో అదికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్ యువకుడు, పనిమంతుడు. కానీ, సీనియర్లు ఆయన మాట వినడం లేదు. సాల్మన్ తన పని తాను సమర్థంగా చేస్తున్నా మొత్తం మిగతావారు ఆయన్ను లెక్కచేయడం లేదట.

పార్టీలో పెరిగిపోతున్న అసంతృప్తి..
జగన్ వస్తే జీవితాలే మారిపోతాయంటూ చెప్పి ఓట్లేయించిన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు జనానికి సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. నాయకులకు పదవులు దక్కలేదు. ఇరుగుపొరుగు రాష్ట్రాల వారికి టీటీడీలో స్థానం కల్పించి రాష్ట్రంలోని నాయకులకు చేయిచ్చారు జగన్. ఇవన్నీ పార్టీ నాయకులు, క్యాడర్‌లో అసంతృప్తిని పెంచుతున్నాయి.

మంత్రులు అవినీతి..
జగన్ ప్రభుత్వానికి నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. ఇద్దరు మంత్రులపై ఇప్పటికే అవినీతి ఆరోపణలు వచ్చాయి. బదిలీలు, పోస్టింగులు, నియామకాల కోసం వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపనలు వస్తున్నాయి.

ఇవి కాకుండా ఇసుక వివాదం, రివర్స్ టెండరింగులు, పీపీఏల రద్దు వ్యవహారం, చంద్రబాబు ఇంటి చుట్టూ వరద నీరు, కూల్చివేతలు, మద్యంఅమ్మకాలు,పథకాలు అమలు కాకపోవడం, రాజకీయ కక్ష సాధింపు, వరదలు, విత్తనాల కొరత, మీడియాపై అణచివేత వంటివన్నీ జగన్ 100 రోజుల పాలనను విఫల పాలనగా మార్చాయని నివేదికలు చెబుతున్నాయి.