టీఆర్ఎస్ కు 20 ఏళ్లు: కేసీఆర్ ఉద్యమానికి ముందు, తర్వాత

August 03, 2020

రెండు దశాబ్దాలు... ఒక సాధారణ నేత... జాతి మెచ్చిన నేతగా మారిన సమయం.  నేటితో టీఆర్ఎస్ స్థాపించి 20 ఏళ్లు అయ్యింది. ఒక పార్టీకి ఇది గొప్ప వేడుక చేయాల్సిన రోజు. కానీ ఈ గొప్ప సందర్భం కరోనా వల్ల వృథా అయిపోయింది. సరే వేడుకలు జరిపినా జరపకపోయినా...  ఆ సంతోషం, సంతృప్తి ఎక్కడికీ పోదు. ఇక దీనికంతటికీ కారణమైన కేసీఆర్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 

వర్దమాన రాజకీయ నాయకుల్లో కేసీఆర్ అరుదైన నాయకుడు. గాంధీ నుంచి కేసీఆర్ దాకా మనం ఎంతో మంది మాస్ లీడర్లను చూసి ఉంటాం. కానీ కేసీఆర్ వంటి కాంబినేషన్ చాలా అరుదు. అనేక అంశాలపై అపార అవగాహన,  మాట చాతుర్యం, వ్యూహరచన, జన భాష, బహుళ భాషా ప్రావీణ్యం ఇలా అన్నీ కలిపి ఉన్న అరుదైన నాయకుడు కేసీఆర్. సాధారణంగా ఇన్ని కాంబినేషన్లు ఒకరిలో ఉండటం చాలా అరుదైన విషయం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోటు ఉంటుంది. కానీ ఈ అరుదైన కాంబినేషన్ వల్ల కేసీఆర్ ఈ కాలంలో ఒక ఉద్యమానికి ఊపిరి పోశాడు. దానిని గమ్యానికి చేర్చారు. కేసీఆర్ లో ప్రతి లక్షణమూ దీనికి తోడ్పడింది. ఉద్యమం చేసిన నాయకులు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఇంట్లో ఉండి తన మాటలతో ఉద్యమాన్ని నడిపించడం కేసీఆర్ ఘనతగానే చెప్పాలి. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునే కేసీఆర్ ప్రజాకర్షక నాయకుడైన ఎన్టీఆర్ తో, మంచి అడ్మినిస్ట్రేటర్ అయిన చంద్రబాబుతో పనిచేసిన అనుభవంతో ఆ రెండింటికీ రాజశేఖర్ రెడ్డి వ్యూహాలను కూడా కలిపి... తెలుగు నేలపై మోస్ట్ పాపులర్ లీడర్ గా ఎదిగారు కేసీఆర్. ఈ ముగ్గురిలోని ది బెస్ట్ థింగ్స్ ను కేసీఆర్ అవగతం చేసుకున్నారు. తనకు పనికొచ్చే విషయాలను శత్రువుల నుంచి కూడా తీసుకునే వ్యక్తి కేసీఆర్. 

ఇది కేసీఆర్ కి ఎల ా సాధ్యమైంది?

1. మాట్లాడే ప్రతి అంశంపై అవగాహన. 

2. ఏదైనా ప్రజలకు నచ్చే పామరుడి భాషలో చెప్పడం

3. హైదరాబాదుతో కూడిన తెలంగాణలో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ ఈ నాలుగు ప్రధాన భాషలుండగా... ఆ నాలుగింటిలో కూడా కేసీఆర్ కి పట్టు ఉండటం. 

4. విద్యార్థి, ఉద్యోగ వర్గాన్ని చాకచక్యంగా ఉద్యమంలోకి దించడం

5. పదవులు - రాజీనామాలు అనే విధానాన్ని అత్యుత్తమంగా ఉపయోగించుకోవడం. 

సమయానకూల వ్యూహాలతో కేసీఆర్  14 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకుంటూ రాగలిగారు. కాంగ్రెస్ ఎత్తులకుపై ఎత్తు వేసి... ప్రతి తెలంగాణీయుడు తెలంగాణ కోరుకుంటున్నారన్న భావన కేంద్రంలో కల్పించడంలో కేసీఆర్ సక్సెస్ అవడంతో తెలంగాణ సాధన సాధ్యమైంది. ఈ క్రమంలో కేసీఆర్ అనేక ఎదురు దెబ్బలు తగిలినా ఆశ కోల్పోకుండా ముందుకు సాగారు. గమ్యంపై గురి ఉన్న వారు ఎవరైనా సాధించి తీరతారు. ఇక కేసీఆర్ లో చెప్పుకోదగిన గొప్ప టాలెంట్ ఏంటంటే.... ఉద్యమంలో ఆంధ్రుల్ని తీవ్రంగా ద్వేషించి, బూతులు తిట్టి... తెలంగాణ జనాల్లో ఆంధ్రులపై  ద్వేష భావం పెంచారు. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడగానే ఆ ద్వేషాన్ని తనే అణచివేశారు. ఆ తర్వాత ఏనాడూ దానిని మళ్లీ తెరపైకి తేలేదు. అనేక చిన్నిచిన్న సంఘాలను వ్యూహాత్మకంగా అణచివేసి ద్వేషాన్ని కంట్రోల్ చేశారు. జనాల్లో పుట్టిన ద్వేష భావం కంట్రోల్ చేయగలిగిన క్రెడిట్ మాత్రం కచ్చితంగా కేసీఆర్ దే. రాష్ట్రం వచ్చి ఆరేళ్లయ్యింది. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు మినహాయిస్తే... మరెందులోను పరాయి రాష్ట్రంలో ఉన్న భావన ఆంధ్రులకు రాకుండా చూసుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. 

ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి... తాను ఎపుడూ చెప్పినట్లే... నీళ్లు, నిధులు విషయంలో నీళ్లను మాత్రం కేసీఆర్ సాధించారు. గ్రామాలను స్వయంసృద్దిగా రూపుదిద్దడంలో ప్రయత్నలోపం లేకుండా ముందుకు వెళ్తున్నారు. పాలమూరు వంటి కరవు జిల్లాలో మాగాణి పెంచారు. అందుకే రెండోసారి కేసీఆర్ అప్రతిహతంగా గెలిచారు. పాలన కూడా ఉద్యమంలాగే కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ఓడి... జగన్ గెలిచాక... అక్కడి సీఎం అసమర్థత కేసీఆర్ ని హీరో చేసింది.