20 కోట్ల రూపాయల చిల్లర నాణాలు దాచేశారు

August 04, 2020

అవి ఎన్నిరూముల్లో, ఎక్కడ, ఎలా దాచి ఉంటారబ్బా అని ఊహించుకుంటున్నారా ? లేక ఇది నిజమా? కాదా అని ఆలోచిస్తున్నారా? నిజమే. ఎక్కడో కాదు. మన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో... ఆయనకు హుండీలు తదితరాల రూపంలో వచ్చే చిల్లర మొత్తం కలిపి చాలా పెద్ద మొత్తం సమకూరింది. గత రెండేళ్లుగా స్వామి వారి ఖజానాలో పోగుపడిన చిల్లర నాణేల విలువ అక్షరాలా రూ.20.5 కోట్లు. ఇంత చిల్లరను టీటీడీ ఎట్లా దాచిందో, ఎంత స్థలంలో దాచిందో అంతుచిక్కని పరిస్థితి. ఏది ఏమైనా... దేశమంతటా స్వామి వారి భక్తులు తమ చిల్లరను తీసుకెళ్లి స్వామి వారి హుండీలో వేశారు.
టీటీడీ వద్ద సమకూరిన చిల్లరలో రూ.5.15 కోట్ల చిల్లర నాణేలను ఈరోజు టీటీడీ అధికారులు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఇప్పటికే చేయాల్సి ఉన్నా... బ్యాంకు అధికారులు అంత చిల్లర లెక్కించడానికి కుదరదు అని ఇంతకాలం ఆపుకుంటూ వచ్చారు. చివరకు ఒప్పుకుని డిపాజిట్ సేకరించారు. అయినా వడ్డీ కాసుల వాడి వద్ద కాసులు లేకుంటే ఎలా.. ? ఆ మాత్రం ఉండాలి. మరి సేకరించిన ఈ చిల్లరను ఎక్కడికి సరఫరా చేశాయో మరి ఆయా బ్యాంకులు. అసలే హైదరాబాదులో కమీషన్ ఇచ్చి మరీ చిల్లర కొంటున్నారు.
టీటీడీ ఒక పనిచేస్తే బాగుంటుందేమో... కళ్యాణ మండపాలు ఉన్నచోటకు ఆ చిల్లరను తరలించి... నోట్లకు చిల్లర పంపిణీ అని ఒకరోజు వార్త ప్రసారం చేస్తే వారంలో చిల్లరంతా పోయి నోట్లు వచ్చేస్తాయి. ఈ ఐడియా పాటిస్తే... రాష్ట్రంలో చిల్లర కొరత పూర్తిగా తీరుతుంది వ్యాపారులకు.