20 రూపాయల కోసం 41 ఏళ్లు వెయిట్ చేశాడు !

August 03, 2020

కేవ‌లం ఇర‌వై రూపాయిలు. ఆ చిన్న మొత్తాన్ని చోరీ చేశారంటూ పెట్టిన కేసు 41 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగింది.  కార‌ణాలు ఏమైనా కానీ సుదీర్ఘ‌కాలం సాగిన ఈ చోరీ కేసును తాజాగా ప‌రిష్క‌రించారు. ఆస‌క్తిక‌ర‌మైన ఈ వ్య‌వ‌హారం రాజ‌స్థాన్ లో చోటు చేసుకుంది. ఇంత‌కీ ఈ చోరీ ఎలా జ‌రిగింది?  ఎందుకిన్ని ద‌శాబ్దాల పాటు సాగింద‌న్న విష‌యాల్లోకి వెళితే..
41 ఏళ్ల క్రితం.. 1978లో తాను బ‌స్సులో ప్ర‌యాణించే స‌మ‌యంలో నిలుచొని ఉన్నాన‌ని.. ఆ స‌మ‌యంలో త‌న జేబులో నుంచి రూ.20 దొంగ‌లించిన‌ట్లుగా ఫిర్యాదు చేశారు బాబులాల్. అప్ప‌ట్లో అత‌ని వ‌య‌సు 20 ఏళ్లు. బాబులాల్ జేబులో నుంచి రూ.20 దొంగ‌త‌నం చేసిన వ్య‌క్తిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నా ఇస్మ‌యిల్ ఖాన్ కు అప్ప‌ట్లో 27 ఏళ్లు. 
చోరీ చేశార‌న్న ఫిర్యాదుతో ఇస్మాయిల్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత బెయిల్ మీద విడుద‌ల‌య్యాడు. త‌ర్వాతి కాలంలో త‌ర‌చూ కోర్టుకు హాజ‌ర‌య్యేవాడు. అయిన‌ప్ప‌టికీ ఈ కేసు వ్య‌వ‌హారం కొలిక్కి రాలేదు. దీంతో 2004 నుంచి ఈ కేసు విచార‌ణ‌కు హాజ‌రు కావ‌టం మానేశాడు ఇస్మాయిల్ ఖాన్. 
ఈ నేప‌థ్యంలో కోర్టు విచార‌ణ‌కు హాజ‌రు కాని నేప‌థ్యంలో అత‌డ్ని అరెస్ట్ చేయాల‌ని కోర్టు ఆదేశించింది. దీంతో గ‌డిచిన మూడు నెల‌లుగా అత‌డు జైల్లో ఉన్నాడు. అదేం సిత్ర‌మో కానీ.. గ‌డిచిన న‌ల‌భై ఏళ్ల‌లో ఇస్తాయిల్ ఆర్థిక ప‌రిస్థితి ఏ మాత్రం మెరుగుప‌డ‌లేదు. అంతేకాదు.. ప్ర‌స్తుతం అత‌డి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. 
దీంతో.. అత‌డికి బెయిల్ ఇచ్చేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇరువురిని పిలిపించిన లోక్ అదాల‌త్‌ లో విచార‌ణ చేప‌ట్టిన మేజిస్ట్రేట్ ఇదే త‌ర‌హాలో నేరాలు చేయ‌కుండా హామీ ప‌త్రాన్ని తీసుకొని ఖాన్ ను విడుద‌ల చేశారు. ఇదే ప‌ని.. ఎప్పుడో చేసి ఉంటే స‌రిపోయేదేమో?