రూ.2 వేల నోటు ఆయుష్షు ముగుస్తోందా?

August 07, 2020

పెద్ద నోట్ల రద్దు వేళ నగదు కొరతను తీర్చేందుకు రూ.2వేల నోటను తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. వెయ్యికి మించి విలువైన ఈ నోటుకు అనతికాలంలో అందరి చేతుల్లోకి చేరిపోవటమే కాదు.. పెద్ద నోట్ల రద్దు తర్వాత నెలకొన్న నగదు కొరతను తీర్చటంలో కీలకంగా వ్యవహరించింది. ఒకప్పుడు విరివిగా దర్శనమిచ్చే రూ.2వేల నోట్లు ఈ మధ్యన పెద్దగా కనిపించట్లేదు.
దీనికి తోడు రూ.2వేల నోట్లను ఎప్పుడైనా రద్దు చేస్తారని.. దీన్ని దగ్గర ఉంచుకోవటం ప్రమాదమని భావించేటోళ్లు లేకపోలేదు. అయితే.. ఇందులో నిజం తక్కువే ఉన్నా.. రూ.2వేల నోట్ల చెల్లుబాటుపై తరచూ వినిపించే పుకార్లు చాలామందికి ఈ పెద్ద నోటు జోలికి వెళ్లేందుకు జంకేలా చేసిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో రూ.2వేల నోట్లు తక్కువగా కనిపిస్తున్న వైనానికి సంబంధించిన షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది.
సమాచార హక్కు చట్టం కింద ఒక మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఊహించని సమాధానం చెప్పి విస్మయానికి గురి చేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రణ్ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల నోటును ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రింట్ చేయలేదన్న విషయాన్ని వెల్లడించారు.
ఎందుకిలా అంటే.. అసలు నోటుకు అచ్చుగుద్దిన రీతిలో నకిలీ నోట్లు పెద్ద ఎత్తున చెలామణిలోకి వస్తున్నట్లుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపివేశారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి పెద్ద నోట్ల రద్దుకు అసలు కారణం వెయ్యి.. రూ.500 నోట్లు పెద్ద ఎత్తున నకిలీలు చెలామణిలో ఉండటంతో.. వాటిని కంట్రోల్ చేయటానికి సంచలన నిర్ణయాన్ని తీసుకుంది మోడీ సర్కారు.
రిజర్వ్ బ్యాంకు సమాచారం ప్రకారం 2016-17లో రెండు వేల నోట్ల ప్రింటింగ్ జరిగింది. ఆ ఏడాది రూ.354.2 కోట్ల మేర ఈ నోట్లను ముద్రించగా.. 2018-19లో 4.66 కోట్ల నోట్లను ముద్రించారు. ఆసక్తికరంగా 2019 నాటికి ఈ నోట్ల సంఖ్య 329.1 కోట్లకు తగ్గటం గమనార్హం. బ్లాక్ మనీని కంట్రోల్ చేయటం కోసమే రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్టీఐ తగ్గించాలని అనుకొని ఉండొచ్చన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఏమైనా.. రూ.2వేల నోట్ల మీద మొదట్నించి చాలానే భయాలు ఉండేవి. తాజాగా ఈ పెద్దనోటును ఈ ఏడాది ఇప్పటివరకూ ఒక్క నోటు కూడా ప్రింట్ చేయలేదన్న విషయం సర్ ప్రైజింగ్ గా మారింది.