జగన్ డిగ్రీపై చంద్రబాబు వ్యాఖ్యలు

February 22, 2020

అభివృద్ధి వికేంద్రీకరణకు, పాలన వికేంద్రీకరణ తేడాతెలియనివాడు మన ముఖ్యమంత్రి. ఇది మన అదృష్టమో, దురదృష్టమో అర్థం కాని పరిస్థితి. కాలమే చెప్పాలి. మాటిమాటికీ ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారు... నిరూపించండి అంటే పారిపోతున్నారు. సరిగ్గా చెప్పాలంటే... 4 వేల కోట్లు ఖర్చు పెడితే ఇపుడు అమరావతిలో నిర్మాణంలో ఉన్న అని భవనాలు పూర్తవుతాయి. ఒక రాష్ట్ర పరిపాలనకు అవసరమైన అన్ని విభాగాలు సరిపోయేటన్ని బిల్డింగులు రెడీ అయిపోతాయి. ఈ విషయాన్ని దాచిపెట్టి ఇన్ సైడర్ అబద్ధాలు చెబుతున్నారు.

ఈ జగన్ ఎక్కడ చదువుకున్నారో తెలియదు. తన చదువంతటినీ మన మీద ప్రయోగిస్తున్నారు అంటూ చురకలేశారు చంద్రబాబు. అమాయక ప్రజలను అబద్ధాలతో నమ్మించడం అనే కొత్త రాజకీయాన్ని జగన్ మొదలుపెట్టారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్లో, వ్యాపారాల్లో ఉంటుంది. భూముల్లో ఉండదు. ఇది మన ముఖ్యమంత్రికి తెలియదు. చెబితే వినడు. విన్నా ఒప్పుకోడు. ఈయన మూర్ఖత్వంతో రాష్ట్రమే ప్రమాదంలో పడి ఉంది.

ఏ డిపార్టుమెంటులో ఏ పని కావాలన్నా... అధికారులు పరిశీలించి ఫైలు సిద్ధం చేస్తే... దానిని మంత్రి ఆమోదించాలి. మంత్రి అమరావతిలో ఉంటాడు. అధికారులు వైజాగ్ లో ఉంటారు. అటు ఇటు ఫైలు తిరుగుతూ ఉంటే పనులెపుడు కావాలి? రాష్ట్రం ఎపుడు బాగుపడాలి అని చంద్రబాబు ప్రశ్నించారు. కొందరు చదువుకోని వారికి ఈ సమస్య అర్థం కాదు. అనుభవంలోకి వచ్చినపుడు ఇది అర్థమవుతుంది. ఆరోజు ఎంత ఇబ్బంది కరమో అన్నీఒకేచోట లేకపోతే అనే విషయం తెలుస్తుంది. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇది ఒక వ్యక్తి సమస్యో, ఒక పార్టీ సమస్యో కాదు... ఐదు కోట్ల ప్రజల సమస్య. 

రాజధాని ఎక్కడో మూలన పెడితే.. ఒక ప్రాంతం  ప్రజలకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది? 1000 కిలోమీటర్లు ప్రయాణించి రాజధానికి ఎపుడు రావాలి? ఏమిటీ అనాలోచిత నిర్ణయాలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలోని తెలుగుదేశం ఆఫీసులో విద్యార్థులతో చంద్రబాబు మాట్లాడారు. ప్రజలను ఈ సమస్యపై చైతన్యవంతులను చేయాలని చంద్రబాబు వారికి పిలుపునిచ్చారు.