ఏపీలో కొత్త వివాదం - గవర్నమెంటు లాయర్లు అవుట్

August 15, 2020

ఏపీలో ముగ్గురు గవర్నమెంటు లాయర్లు రాజీనామాలు చేయడం సంచలనం అయ్యింది.  ఏడాదిలోపే సుమారు 65 కేసుల్లో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి. నిర్ణయాలు తీసుకునేటపుడు, పథకాలు రూపొందించేటపుడు, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రణాళిక రచించేటపుడు లీగల్ సమస్యలు రాకుండా వాటిని తయారుచేయడంలో విఫలం కావడం వల్లే అవి కోర్టుల్లో వీగిపోతున్నాయి. 

కానీ అవన్నీ ప్రభుత్వ న్యాయవాదుల అసమర్థత వల్లే కేసులు పోయాయని  ప్రభుత్వం బలంగా నమ్మడంతో ఆ లాయర్లకు తిట్లు పడ్డాయి. అంతేకాదు, ప్రభుత్వం నుంచి వ్యతిరేక తీర్పు వచ్చినపుడల్లా వారిపై క్రమేపీ ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వం ఒత్తిడికి తట్టుకోలేకపోతున్న ప్రభుత్వ లాయర్లు చివరకు రాజీనామా చేశారు. ఇవి రాజీనామాలే కానీ... ప్రేరేపించబడిన బలవంతపు రాజీనామాలు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక రాజీనామాలు చేసిన వారిలో పెనుమాక వెంకట్రావు (గవర్నమెంట్ సర్వీసెస్ వ్యవహారాలు వాదించే లాయర్), షేక్ హబీబ్ (సంక్షేమ పథకాలు) గెడ్డం సతీష్ బాబు (రవాణా వ్యవహారాలు) ఉన్నారు. వీరు సడెన్ గా రాజీనామా  చేయడం,  వెంటనే వాటిని ఆమోదించమని అడ్వకేట్ జనరల్ గవర్నమెంటుకు సిఫారసు చేయడం, ప్రభుత్వం ఆ రాజీనామాలను ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. 

దీన్ని బట్టి ఏపీ గవర్నమెంటులో ఏం జరుగుతుందో అందరూ అంచనా వేసుకునే పరిస్థితి. అత్త మీద కోపం దుత్త మీద చూపడం అంటే ఇదే మరి.