జగన్ ని ముంచేవి ఆ మూడే...

February 25, 2020

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దేశాన్ని తన వైపు చూసేలా చేస్తానని ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు గాని ప్రస్తుతం రాష్ట్రంలో అయితే ఆ పరిస్థితి ఉంది. దేశంలో చరిత్రలో ఏనాడూ జరగని రాజధాని మార్పు ఆలోచన చేశాడు జగన్. చట్టబద్ధంగా గాని, నైతికంగా గాని, ప్రాంతీయత పరంగా గాని దీనికి అనేక అడ్డంకులు ఉన్నాయి. అయినా.. ముందుకు వెళ్లడానికే జగన్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక జగన్ చేసిన ప్రతిపాదనపై రాజకీయ పార్టీలన్నీ మండిపడుతున్నాయి. బీజేపీ అంతెత్తున లేస్తోంది. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2014లో అమరావతి రాజధాని అని ఏపీ ప్రభుత్వం పిలిచింది. అధికార, ప్రతిపక్ష నేతలు దానిని ఆమోదించారు. అందుకే ప్రధాని మోడీ శంకుస్థాపనకు హాజరయ్యారు. ఇపుడు దానిని మారుస్తుంటే బీజేపీ ఊరుకోదు. న్యాయపోరాటం చేసి రాజధాని కదలకుండా చేస్తాం అని కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగన్ గురించి ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ రాష్ట్రాన్ని వెనక్కు నడిపిస్తున్నారు. దీనికి కారణం ఆయనలోని మూడు లక్షణాలు. 1. అనుభవ రాహిత్యం, 2. అవగాహన రాహిత్యం, 3. ఇగో... ఈ మూడు జగన్ ను తప్పుదారి పట్టిస్తున్నాయి. తలాతోకాలేని నిర్ణయాలతో జగన్ ముందుకు వెళ్తున్నది ఈ మూడు లక్షణాల వల్లే అని కన్నా విమర్శించారు. ఆర్నెల్లో జగన్ ప్రభ అథ:పాతాళానికి పడిపోవడానికి ఆయనలోని ఈ మూడు లక్షణాలే కారణం అని కన్నా అన్నారు. సచివాలయం నిర్మిస్తే.. అభివృద్ధి జరిగినట్లు అనుకుంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు ఉన్నా... కొన్ని నగరాలు మాత్రమే ఎందుకు అభివృద్ధి చెందాయి. నేనొకటి నొక్కి చెబుతున్నాను... వచ్చే  ఐదేళ్లలో జగన్ కనీసం వైజాగ్ లో శంకుస్థాపన కూడా చేయలేరు అని కన్నా బల్లగుద్ది చెప్పారు.