మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి

August 07, 2020

విభజన నాటి పరిస్థితులే ఇప్పటికీ
ఏడాదిగా మరింత దుర్భరం
దిగజారిన ఆంధ్ర ఆర్థిక పరిస్థితి
అప్పుచేసి పప్పుకూడు
సంక్షేమం పేరిట వేల కోట్లు వృధా
ఆస్తుల కల్పన ఒట్టిమాటే
రాజధాని ఆకాంక్ష ఎక్కడిదక్కడే


ఐదు కోట్ల మంది సీమాంధ్రుల మాటకు విలువివ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలుచేసింది. అడుగడుగునా నవ్యాంధ్రకు అన్యాయం జరిగేలా.. తెలంగాణకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించింది. ఇది అన్యాయమైన విభజన అని చాలా మంది బాధపడ్డారు. రాజధానే లేని రాష్ట్రంగా అవతరించిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర. తీవ్ర రెవెన్యూ లోటు, ఆర్థిక కష్టాల నడుమ.. పారిశ్రామికీకరణ, ఐటీ, పెట్టుబడులు, వ్యాపారాలు ఎలా నడుస్తాయన్న ఆందోళన ఆరేళ్ల క్రితం ఎంత తీవ్రంగా ఉందో..

 

ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఉంది. కనీసం  ఉద్యోగులకు జీతాలైనా ఇవ్వలేని పరిస్థితి. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని...తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కుతాయన్న ఆశాభావం అందరిలోనూ ఉండేది. హైదరాబాద్‌ లాంటి నగరాన్ని పోగొట్టుకున్న వారుగా.. మళ్లీ ఒక గొప్ప నగరం చూడగలిగితే బాగుండన్న బలమైన కాంక్ష ఉండేది. గత ఆరేళ్లుగా ఈ కోరికలు నెరవేరలేదు. హోదా అందని ద్రాక్షే అయింది. చంద్రబాబు ఉన్నప్పుడు హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు ఆయన ఎన్డీఏకి దూరమయ్యారని ప్యాకేజీ కూడా నిలిపివేశారు.

 

పాతిక మంది ఎంపీలను ఇస్తే కొట్లాడి సాధిస్తామని నిరుడు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఊరూరా ఊదరగొట్టిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇంతవరకు నోరెత్తిన పాపాన పోలేదు. కేంద్రంలో తక్కువ మెజారిటీ ఉన్న ప్రభుత్వం వస్తేనే హోదా దక్కుతుందని ఇటీవల ఆయన వాక్రుచ్చారు. చంద్రబాబుపై తప్పుడు విమర్శలు చేసినప్పుడు ఈ బుద్ధి ఏమైందో తెలియదు.

 

త్రిశంకు స్వర్గంలో..
రాఽజఽధాని ఎక్కడన్నది కూడా చెప్పకుండా రాష్ట్ర విభజన చేశారు. రాజధాని ఎక్కడనేది నిర్ణయించేందుకు వేసిన కమిటీ అన్ని ప్రాంతాలకు వెళ్లి పర్యటించి.. అన్ని ప్రాంతాల్లోను అదేదో తమవద్దకే రావాలన్న ఆకాంక్షలు రేపింది. అయినా ఆ తర్వాత చంద్రబాబు మరో ప్రభుత్వ కమిటీని నియమించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండేలా, నది ఒడ్డున నీటికొరత లేకుండా ఉండేలా, అదే సమయంలో అటు విజయవాడ-ఇటు గుంటూరు కూడా కలిసిపోతే ఒక మహానగరం ఆవిర్భవించేలా ఉంటుందనే ఉద్దేశంతో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారు.

 

రాష్ట్ర చరిత్రను, వారసత్వాన్ని పుణికిపుచ్చుకునేలా అమరావతి అనే పేరు పెట్టారు. ప్రతి ఒక్కరిలోనూ ఆ రోజు పులకింత. 10-15 ఏళ్లలో ఒక గొప్ప రాజధాని రూపుదిద్దుకుంటుందనే ఆశ కలిగింది. చంద్రబాబు పిలుపు మేరకు రైతులు 33 వేల ఎకరాలను భూ సమీకరణ కింద ఇచ్చారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టింది. ఆ తర్వాత వెలగపూడిలో ఆరునెలల్లోనే సచివాలయ, అసెంబ్లీ భవనాలు సిద్దమయ్యాయి. పాలన ఇక్కడ కొలువుదీరింది. యావత ప్రజలు, భూసమీకరణ కింద భూములిచ్చిన రైతుల్లో ఆశలు రెక్కలు తొడిగాయి.

 

అనంతరం మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం నవ నగరాలు నిర్మించేందుకు పనులను ప్రారంభించారు. రోడ్లు, డ్రైనేజీల పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలకు, ఐఏఎస్‌లకు క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. న్యాయమూర్తులు, మంత్రులకు విల్లాల నిర్మాణానికి శ్ల్లాబ్‌లు వేశారు. హైకోర్టు భవనం పూర్తయి కార్యకలాపాలు ప్రారంభించింది. కేంద్రం ఇచ్చిన సొమ్ముతో పాటు మొత్తంగా సుమారు రూ.10వేల కోట్ల వరకు అమరావతిపై ఖర్చుపెట్టారని అంచనా. విభజన నాటి సమస్యల్లో ఒకటిగా ఉన్న రాజధాని అంశం క్రమంగా పరిష్కారమవుతున్నట్లే కనిపించింది.

 

ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉండగా ఎన్నడూ అమరావతిని మారుస్తామని చెప్పలేదు. పైగా చంద్రబాబుకే ఇక్కడ ఇల్లు లేదు. జగన్‌ కట్టుకున్నారు. మేం రాజధానిని మరింత వేగంగా అభివృద్ధి చేస్తామన్న రీతిలో ఆ పార్టీ నేతలు మాట్లాడారు. రాజధానిని మార్చేది లేదని అమరావతిలో కార్యకర్తల సాక్షిగా జగన్‌ చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని ఆయన అధికారంలోకి రాగానే తేలిపోయింది. ప్రమాణం చేయకముందే రాజధాని నిర్మాణ పనులు ఆపేశారు. అవినీతిపై తేలాకే పనులు పునఃప్రారంభిస్తామన్నారు.

 

ఏమీ తేలకపోవడంతో అకస్మాత్తుగా రెండు కమిటీలను వేసి మూడు రాజధానులు.. అమరావతిలో శాసన రాజధాని(అసెంబ్లీ), కర్నూలులో న్యాయ రాజధాని (హైకోర్టు), విశాఖలో కార్యనిర్వాహక రాజధాని (సచివాలయం) ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకున్నారు. శాసనమండలిలో టీడీపీ అడ్డుకోవడంతో దానిని సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. ఇదేమీ తేలకుండా కార్యాలయాలను విశాఖకు తరలిస్తే ప్రభుత్వ యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించడం వేరే విషయం.

 

మొత్తానికి రాజధాని అమరావతి పరిస్థితి ఇప్పుడు గందరగోళంలో పడింది. కరోనా వైరస్‌తో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా.. ఆయన రాజధానిని విశాఖకు తరలించే ప్రక్రియను ఆపలేదు. జీవోలిస్తే హైకోర్టు మాడుపై కొడుతుందన్న భయంతో తెరచాటు ప్రయత్నాలు ప్రారంభించారు. విజయసాయిరెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌లను తరచూ విశాఖ పంపుతూ సీఎం కార్యాలయం, సచివాలయం కోసం కార్యాలయాలు అన్వేషిస్తున్నారు.

 

కొత్తరాష్ట్రంపై విశ్వసనీయత ఏదీ?
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లలో విశ్వసనీయత కల్పించాలి. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఢోకా లేదన్న నమ్మకం కలగాలి. అది కల్పించేందుకు తొలి ఐదేళ్లలో గట్టి ప్రయత్నమే జరిగింది. పారిశ్రామిక పెట్టుబడుల సదస్సులు ఏటా పెద్దఎత్తున విశాఖపట్నంలో నిర్వహించడం, పెట్టుబడుల కోసం దేశదేశాలు తిరగడం, కియలాంటి పరిశ్రమలు తేవడం కొంత విశ్వసనీయతను తెచ్చిపెట్టాయి.

 

కొత్త రాష్ట్రమైనా, మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉన్నా...పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా అడుగుపెట్టాయి. గన్నవరంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విజయవాడ-గుంటూరుల్లో పలు ఐటీ కంపెనీలు, చిత్తూరులో పలు సెల్‌ఫోన్‌ కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయి. జగన్‌ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా పెట్టుబడులు ఊపందుకోలేదు. చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ రాలేదు.

 

విద్యుత పీపీఏల సమీక్ష, కియ లాంటి పరిశ్రమలకు బెదిరింపులు.. పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి. పెట్టబడి సదస్సుల్లో అవగాహన కుదుర్చుకున్న సంస్థలపై జగన్‌ అండ్‌ కో తీవ్ర ఒత్తిళ్లు తెస్తోందని.. పరిశ్రమల్లో వాటాలు అడుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఎలాగున్నా.. చాలా మంది పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వెళ్లిపోయారు. కొన్ని పరిణామాల కారణంగా కియ సంస్థ రూ.450 కోట్ల అదనపు పెట్టుబడి పెడతామని ఇటీవల ప్రకటించినా.. విడిభాగాల ప్లాంట్లను మాత్రం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలకు మళ్లించడం గమనార్హం.


ఆర్థిక పరిస్థితి మళ్లీ వెనక్కి..
రాష్ట్ర విభజన నాడు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి. లోటు బడ్జెట్‌తో ప్రారంభమైనా.. చంద్రబాబు వారికి ఒక్కరోజు కూడా జీతాలు ఆపలేదు. ఠంచనుగా ఒకటో తేదీనే అందించారు. క్రమంగా ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు రెండూ కొనసాగించారు. అప్పులు ఎక్కువుగా తెస్తున్నారనే విమర్శలు ఆ రోజుల్లో వెల్లువెత్తాయి.

 

ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ విరుచుకుపడింది కూడా. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఏలుబడిలో ఒక్క ఏడాదిలోనే రూ.87 వేల కోట్ల అప్పులు తెచ్చారు. తెచ్చిన అప్పులు, వస్తున్న ఆదాయమంతా సంక్షేమ పథకాల ముసుగులో ఖర్చుపెట్టేస్తున్నారు. ఆస్తుల కల్పన ఆగిపోయింది. అభివృద్ది కుంటుపడింది. ఫలితంగా.. ఒకప్పుడు రాష్ట్రానికి వచ్చి వ్యాపారాలు చేసేందుకు చొరవచూపిన పలువురు వ్యాపారవేత్తలు...ఇక్కడికంటే హైదరాబాదే బెటర్‌ అని వెళ్లిపోయారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఇతర వ్యాపారులదీ ఇదే బాట.