మాకొద్దీ డాలర్ బతుకులు... మా ఊరికి పోతాం

August 05, 2020

‘‘మా వాడు అమెరికాలో ఉన్నాడు‘‘

‘‘మా అబ్బాయి లండన్ లో ఉన్నాడు‘‘

’’మా అమ్మాయి న్యూజిలాండ్ లో జాబ్ చేస్తోంది‘‘

కొన్ని నెలల క్రితం వరకు ఈ మాటలు గర్వంగా చెప్పకున్న తల్లిదండ్రులు మా పిల్లలు మా ఇంటికి వస్తే చాలు.... అని కోరుకుంటున్నారు. అక్కడ ఉంటున్న వీరి పిల్లలు... సర్ ప్లీజ్ సార్... మా టిక్కెట్లు మేము పెట్టుకొంటాం. మమ్మల్ని మా ఊరికి తీసుకుపోండి. మాకదే పదిలక్షలు అంటున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా సీన్ మారిపోయింది. కుటుంబంతో కలిసి బతికితే చాలు డాలర్లు, యూరోలు వద్దు, విదేశీ చదువులు కూడా వద్దు. బతికుంటే బలుసాకు తింటాం అంటున్నారు. ఎలాగోలా మమ్మల్ని మా సొంతూరికి పంపండి అంటున్నారు.

విదేశంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు, పర్యాటకులు, తాత్కాలిక వీసాలపై వెళ్లి పనిచేస్తున్న వారు వీరంతా... వెంటనే ఇండియా వచ్చేయాలనుకుంటున్నారు. అనూహ్యంగా....30 వేల మంది తెలుగు వారు వేర్వేరు దేశాల నుంచి ఏపీకి రావడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 

ఇది ప్రభుత్వం ఊహించిన దానికంటే పెద్ద సంఖ్య. విదేశాల నుంచి వారు రాగానే టెస్టులు చేసి క్వారంటైన్ కి గాని లేదా ఆస్పత్రికి గానీ తరలిస్తామని వీరి కోసం నియమించిన ప్రత్యేక అధికారి కృష్ణబాబు వెల్లడించారు. ఈ క్వారంటైన్లో పెయిడ్ అంటుంది, ఫ్రీ క్వారంటైన్ కూడా ఉంటుందన్నారు. ఆ తర్వాత కూడా 14 రోజులు ఇంట్లో క్వారంటైన్లో ఉండాల్సిందేనట. 

విదేశీ ప్రయాణకుల కోసం ఢిల్లీలో ఏపీ తరఫున నోడల్‌ అధికారిగా హరీశ్‌కుమార్‌, ఏపీలో బాబూరావు నాయుడు ఉంటారని తెలిపారు. అమెరికా నుంచి తొలి విమానం సోమవారం హైదరాబాద్‌ వస్తుంది. వీరిని విజయవాడలోనే క్వారంటైన్‌ చేస్తామని కృష్ణబాబు వెల్లడించారు.