మనకూ మూడిందా? మూడో కేసు కూడా కేరళ నుంచే..

August 14, 2020

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ముప్పు భారత్ కు పెద్దగా లేనట్లే. చైనాను చుట్టేస్తున్న ఈ మహ్మమారి కారణంగా ఇప్పుడా దేశంలో అతలాకుతలమవుతోంది. వందలాది మంది మరణిస్తుంటే.. వేలాది మంది కరోనా బారిన పడుతున్నారు. లక్షలాది మంది అనుమానితులుగా ఉన్నారు. ఇలాంటివేళ.. దేశంలో ఇప్పటివరకూ రెండు కేసులు నమోదు కాగా.. తాజాగా మూడో కేసు కూడా నమోదైంది. అయితే.. మూడో కేసు కూడా కేరళ నుంచే నమోదు కావటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం.
కేరళలో కరోనా వైరస్ కు చెందిన మూడో కేసు కూడా నమోదైనట్లుగా ఆ రాష్ట్ర  ఆరోగ్య శాఖామంత్రి కేకే శైలజ కూడా కన్ఫర్మ్ చేశారు. తాజా కేసు కాసర్ గోడ్ జిల్లాలో నమోదైంది. ప్రస్తుతం బాధితుడ్ని ప్రత్యేకంగా ఒక వార్డులో పెట్టి చికిత్స చేస్తున్నారు. చైనాలోని వూహాన్ మహా నగరంలో మొదలైన ఈ వైరస్ అనతి కాలంలోనే దాదాపు పాతిక దేశాలకు పాకింది. మన దేశంలో ఇప్పటివరకూ మూడు కేసులు పాజిటివ్ కాగా.. ఈ మూడు కేరళ రాష్ట్రానికి చెందిన వారే కావటం గమనార్హం.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడా దేశానికి ఈ వీసా సౌకర్యాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. అమెరికా.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని తమ దేశంలోకి రానివ్వకూడదని డిసైడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే మన దేశంలోని అన్ని రాష్ట్రాల యంత్రాంగాలు ప్రత్యేక వైద్య పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికి వెలుగు చూసిన మూడు కేసులు కేరళ నుంచి కావటంతో.. దేవతలు నడయాడే నేలలో కరోనా పిశాచి అడుగులు వడివడిగా పడుతున్నాయి. వీటిని ఆపకుంటే మనకూ మూడినట్లేనని చెప్పక తప్పదు.