హాలిడేస్‌... ఏపీ నేత‌ల‌కు గుడ్‌, కేసీఆర్‌కు బ్యాడ్‌

May 28, 2020

అదేంటి... హాలిడేస్ కి వారికేం సంబంధం ? ఏమిటీ లెక్క అనుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రాలో ఎన్నిక‌లు జ‌రిగే తేదీ ఏప్రిల్ 11, గురువారం. దీంతో ఆ రోజు ఓటేసేందుకు ప‌బ్లిక్ హాలిడే ఇచ్చారు. మ‌రుస‌టి రోజు శుక్ర‌వారం...ఆ ఒక్క‌రోజు సెల‌వు పెడితే త‌ర్వాత సెకండ్ సాట‌ర్‌డే. వెంట‌నే ఆదివారం. ఇలా 4 రోజులు ఎపుడు సెల‌వు వ‌చ్చినా హైద‌రాబాద్ ఖాళీ అవుతుంది. ఈ ఖాళీ అయ్యే క్ర‌మంలో ఆంధ్రాకు వ‌ల‌స‌లు భారీగా ఉంటాయి. సో ... సెటిల‌ర్ష్‌పై విపరీతంగా ప్రేమ చూపించిన కేసీఆర్ వారి ఓట్ల‌న్నీ త‌న‌కే ప‌డ‌తాయ‌ని భావించారు. అయితే, వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వు, ఊర్లో ఎన్నిక‌ల పండ‌గ నేప‌థ్యంలో అంద‌రూ ఊరికి వెళ్లే ప్ర‌మాదం ఉంది. పైగా ఇవి లోక్‌స‌భ ఎన్నిక‌లు. ఆంధ్రాలో లోక‌ల్ ఎన్నిక‌లు. దీంతో ఈ ఎన్నిక‌ల్లో హైద‌రాబాదు పోలింగ్ 50 శాతం దాటే ప్ర‌స‌క్తే లేదు అంటున్నారు. తెలుగు వాళ్లే కాదు. ఏప్రిల్ 11న దేశ వ్యాప్తంగా మొద‌టి విడ‌త పోలింగ్ ఉంది. పోలింగ్ ఉన్న చోట‌ల్లా జ‌నం ఊరికి వెళ్తారు. మిగ‌తా వాళ్ల‌యినా ఉంటార‌ని చెప్ప‌లేం. ఎందుకంటే నాలుగు రోజులు సెల‌వొస్తే జాలీ ట్రిప్‌కు వెళ్తారు. అస‌లే ఎండాకాలం. ఇక్క‌డ ఉండి ఏం చేస్తారు?
ఈ వ‌రుస సెల‌వులు టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నాయి. అంద‌రికీ భ‌య‌మే గాని... టీఆర్ఎస్ ఎక్కువ ఆందోళ‌న చెందుతోంది. ఇదిలా ఉంటే... ఏపీలో నేత‌ల పండ‌గ చేసుకుంటున్నారు. మొత్తం ఏపీ ఆ నాలుగు రోజులు క‌ళ‌క‌ళ‌లాడుతుంది. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే ఓట‌ర్లు వ‌చ్చి ఓటేస్తుంటే మ‌రి ఏపీ వాళ్ల‌కు హాయిగా ఉండ‌దా. వైసీపీ కంటే.. జ‌న‌సేన‌, టీడీపీ వాళ్లు ఈ విష‌యంలో ఎక్కువ హ్యాపీ. ఎందుకంటే.. గోదావ‌రి, కృష్ణా, గుంటూరు వారు హైద‌రాబాదులో ఉండేవారిలో ఎక్కువ శాతం ఉంటారు. అక్క‌డ త‌మ ఓట‌ర్లే ఎక్కువ అని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే పోలింగ్ ముగిశాక ఇక పందాలు మొద‌లవుతాయి. ఈ ఎన్నిక‌ల పందాలు కోడి పందేల కంటే హాటుగా సాగుతాయి. పైగా ఆ త‌ర్వాత అంచ‌నాలు, చ‌ర్చ‌లు మ‌హా రంజుగా ఉంటాయి. అందుకే అందరూ ఊరి బాట ప‌డ‌తారు. హైద‌రాబాదు ఖాళీ అవుతుంది.