అమెరికాలో కాల్పులు ఆగట్లేదు.. ఈ సారి నలుగురు

August 08, 2020

అగ్రరాజ్యంగానే కాకుండా ప్రపంచ పోలీస్ గా పేరొందిన అమెరికాలో కాల్పుల మోత ఆగడం లేదు. ఉన్మాదంతో చెలరేగిపోతున్న ఆ దేశానికి చెందిన కొందరు దుండగులు జరుపుతున్న కాల్పుల్లో ఆ దేశ పౌరులతో పాటు విదేశాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే చనిపోతున్నారు. ఈ తరహా దాడులను అరికట్టేందుకు అక్కడి పోలీసులు ఎన్ని యత్నాలు చేస్తున్నా వాటికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కాన్సాస్ లో జరిగిన తాజా కాల్పుల్లో ఓ నలుగురు పౌరులు చనిపోగా, మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. బార్ లోకి చొరబడ్డ దుండగులు..అక్కడి సమూహాన్ని టార్గెట్ చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 

కాన్సాస్‌లోని ఓ బార్ లోకి ఆయుధాలను చేతబట్టి రంగంలోకి దిగిపోయిన దుండగులు పదుల సంఖ్యను లక్ష్యం చేసుకొని విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోగానే తన పని పూర్తి అయిపోయిందన్నట్లుగా దుండగులు అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. కాల్పుల శబ్ధంతో స్థానిక పోలీసులు స్పందించేలోగానే దుండగులు పారిపోయారు. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే చనిపోగా... మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. 

అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీకెండ్ కావడంతో బార్ కూడా జనంతో ఫుల్లుగానే ఉంది. ఇదే అదనుగా ఎంట్రీ ఇచ్చిన దుండగులు... వీలయినంత ఎక్కువ మందినే పొట్టనబెట్టుకునేందుకు యత్నించారు. వచ్చీ రాగానే తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించిన దుండగులు... ఆ తర్వాత వచ్చినంత వేగంతోనే పారిపోయారు. ఘటనపై సమాచారం తెలియగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చినా... అప్పటికే దుండగులు పారిపోయారు. పారిపోయిన దుండగుల కోసం ఇప్పుడు అక్కడ ముమ్మర వేట సాగుతోంది.