ఆ ఎమ్మెల్యేలపై నాలుగేళ్లు బ్యాన్

November 17, 2019

కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆర్. శంకర్, మరో ఎమ్మెల్యే రమేష్ జార్జిహోళీ, మహేష్ కుమాటల్లిలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని పదో షెడ్యూల్ ప్రకారం వారిపై అనర్హత వేటు వేసినట్టు స్పీకర్ తెలిపారు. ముగ్గురు ఎమ్మెల్యేలు 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం లేదని తేల్చారు. కర్ణాటకలో 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వానికి రెబల్స్‌గా మారడం.. దీంతో నాలుగు రోజుల హైడ్రామా తర్వాత విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓడిపోవడం తెలిసిందే. దీంతో కుమారస్వామి రాజీనామా కూడా చేశారు.
కాగా... కుమారస్వామి ప్రభుత్వం పడిపోయిన 48 గంటల్లోనే రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అనర్హత వేటు పడినవారిలో ఆర్. శంకర్ గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తానని, ఆ పార్టీలో కలుస్తానని గవర్నర్‌కు లేఖ రాశారు. దీంతో రెబల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య ఫిర్యాదు చేశారు.
కాగా.. మిగతా 13 మందిపై స్పీకరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. ఈ అనర్హత వేటు కారణంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది రాకపోవచ్చు. సభలో సభ్యుల సంఖ్య తగ్గడం వల్ల బీజేపీ ప్రభుత్వంఏర్పాటు తరువాత అవసరమైతే కొత్త సీఎం బలపరీక్షలో సులభంగా గట్టెక్కడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి.