ఏంటి జగన్ పాలన 400 మందిని చంపిందా?

June 03, 2020

తాను సీఎం అయిన వెంటనే రైతే రాజని....తమ ప్రభుత్వ హయాంలో రైతన్నలదే రాజ్యమని ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చేది రాజన్న రాజ్యమని....రాజన్న రాజ్యంలో రైతులంతా సుభిక్షంగా ఉంటారని జగన్ ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, రైతులకు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను జగన్ మరచిపోయారని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్ పై టీడీపీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు హయాంలో రైతు...రాజులా బ్రతికాడని...జగన్ హయాంలో రైతుల చేతికి చిప్ప వచ్చిందని సెటైరికల్ ట్వీట్ చేశారు. 

సీఎం వైెఎస్ జగన్ పై నారా లోకేశ్ విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. ట్విట్టర్ వేదికగా జగన్ పై లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. బీసీలకు కోత పెట్టిన కటింగ్ మాస్టర్ జగన్ అంటూ చంద్రబాబు, జగన్ టైలర్ షాప్ ల సెటైరికల్ ట్వీట్ పెట్టిన లోకేశ్...తాజాగా నాడు నేడు అంటూ చంద్రబాబు, జగన్ పాలనను పోల్చారు. చంద్రబాబు హయాంలో రైతుల స్థితి, జగన్ పాలనలో రైతుల దుస్థితి తెలిపేలా నాడు-నేడు అంటూ ఓ కార్టూన్ ట్వీట్ చేశారు. రూ.12,500 రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, ఉచితబోర్లు, ఉచిత విద్యుత్.. ఇలా అన్నీ కలిపి, ఏడాదికి రైతుకి లక్ష రూపాయలు లబ్ధి అని జగన్ చెప్పారని లోకేశ్ ట్వీట్ చేశారు. అయితే, జగన్ అధికారంలోకి వచ్చి 10 నెలలైందని, లక్ష మాట దేవుడెరుగు.. కనీసం సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేని అసమర్థ  ప్రభుత్వం ఏపీని పరిపాలిస్తోందని లోకేశ్ సెటైర్ వేశారు. జగన్ 10 నెలల పాలనలో 400మంది రైతుల్ని బలితీసుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు.