14 నెలలు - 400 రేప్ లు !! జగన్ సర్కారుని ఉతికేసిన బాబు !

August 07, 2020

ఏపీలో ఇటీవల అఘాయిత్యాలు పెరిగాయి. మరీ మైనర్లపై అత్యాచారాలు జరుగుతుండటం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బాలికను 4 రోజులు గ్యాంగ్ రేప్ చేసి పోలీసు స్టేషనుకు తీసుకొచ్చి నిందితులే సవాల్ చేసినట్లు ఓ వార్త సంచలనం అయ్యింది. ఇది బీహారా? ఏపీనా ? అంటూ జనం తీవ్ర కలతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అరాచకలపై వరుస ట్వీట్లు వేశారు.

దిశ చట్టం అంటూ హడావుడి చేశాక రాష్ట్రంలో మరిన్ని అత్యాచారాలు పెరిగినట్టు చంద్రబాబు ఆరోపించారు. 14 నెలల్లో 400 రేప్ లు జరిగాయడంటో ఆడపిల్లలకు ఏపీలో ఎలాంటి స్వేచ్ఛ లేదని అర్థమయ్యిందని చంద్రబాబు ... జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సర్కారుకు సదుద్దేశం ఉంటే దిశ చట్టాన్ని ఆమోదింపజేసేదని.. అది కేవలం ప్రచారార్భాటంతో బిల్లుగా ఆగిపోయిందని... అన్నారు. కనీసం నిర్బయ చట్టాన్ని అయినా కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తన వరుస ట్వీట్లలో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని కింద యతాతథంగా చదవొచ్చు.

"దిశ" చట్టం చేసేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం... అమలులో ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసింది. మహిళలకు రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి, నిబద్దత ప్రభుత్వానికి ఉంటే ఈ వరుస అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి? 

రాజమహేంద్రవరంలో ఒక మైనర్ దళిత బాలికను 4 రోజులపాటు నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి, సామూహిక అత్యాచారానికి పాల్పడి... చివరికి నిందితులే బాధిత బాలికను పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి... పోలీసులనే సవాల్ చేసారంటే... రాష్ట్రంలో నేరగాళ్లు ఎంతగా పేట్రేగిపోతున్నారో చూడండి. 

చిత్తూరు జిల్లా యేర్పేడు మండలంలో దళిత బాలిక, నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లెలో మరో బాలిక, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకో దళిత బాలిక, గుంటూరులో ముస్లిం బాలిక, నెల్లూరులో మరో మహిళపై అత్యాచారాలు.. ఇప్పుడీ దళిత మైనర్ బాలిక. 14నెలల్లో 400పైగా అత్యాచారాలు, 16 గ్యాంగ్ రేప్ లు.. నెల్లూరులో మహిళా ఎంపిడివోపై, చిత్తూరులో దళిత మహిళా డాక్టర్ పై దౌర్జన్యాలు, మాస్క్ పెట్టుకోమన్న మహిళా ఉద్యోగిని పై ప్రభుత్వ కార్యాలయంలోనే భౌతికదాడి,...ఇవన్నీ ఏపీలో మహిళలపై అరాచకాలకు పరాకాష్ట?

పాలకులు స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తే.  దాని దుష్ఫలితాలు ఇలాగే ఉంటాయి.ఇప్పటికైనా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. బాధితులకు న్యాయం చేయాలి. బడుగు బలహీన వర్గాల పేదల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలి.

అసలు చంద్రబాబు షేర్ చేసిన సమాచారం చూస్తుంటే... ఇన్ని దారుణాలు జరుగుతుంటే పోలీసులు ఉన్నట్టా లేనట్టా అనిపించే పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అరాచకాలపై దృష్టి పెట్టి ఆడపిల్లలపై అఘాయిత్యాలు తగ్గించాలి.