ఆ సినీనటి ఇంటి కరెంటు బిల్లు రూ.42 వేలు

August 07, 2020

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరూ చేయని పనులు  తరచూ  కోలీవుడ్  నటీనటులు చేస్తుంటారు. సమాజంలో చోటు చేసుకునే తప్పొప్పులతోపాటు.. ప్రభుత్వాలు చేసే తప్పుల్ని సైతం మొహమాటం లేకుండా కడిగేస్తుంటారు. టాలీవుడ్ లో మాత్రం అందుకు  భిన్నంగా  బర్త్ డేలకు  గ్రీటింగ్ లతో పాటు.. ఏదైనా సాధించినట్లుగా తేలినంతనే ఆకాశానికి ఎత్తేసేలా ట్వీట్లు.. పోస్టులు పెడతారే తప్పించి.. సామాన్యులు ఎదుర్కొనే సమస్యలపైన గళం విప్పే ప్రయత్నం చేయరు. తాజాగా సినీ నటి స్నేహ భర్త కమ్ నటుడు ప్రసన్న లేవనెత్తిన ఒక అంశం తమిళనాడులో  ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసింది.

లాక్ డౌన్ నేపథ్యంలో కరెంటు బిల్లులు తడిచి మోపెడు కావటం.. పెద్ద ఎత్తున బిల్లులు రావటంతో కిందామీదా పడుతున్నోళ్లు చాలామందే ఉన్నారు. తన ఇంటికి వచ్చిన రూ.42వేల బిల్లు గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు ప్రసన్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు బిల్లు చెల్లించటం సామాన్య ప్రజలకు కష్టంగా మారిందన్న ఆయన.. వాయిదాల పద్దతిలో కరెంటు బిల్లుల్ని చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని కోరారు.
అక్కడితో ఆగని ఆయన.. లాక్ డౌన్ వేళ.. తమిళనాడు పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీఎన్ఈబీ) మనల్ని దోచుకుంటోందని ఎంతమంది భావిస్తున్నారు? అంటూ ఘాటైన ఒక ప్రశ్నను పోల్ చేశారు. ఒక ప్రముఖ నటి భర్త కమ్ నటుడు ఇలాంటి ప్రశ్నను సంధిస్తే సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరగాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం ఉంది. ఇప్పటికే కరెంటు బిల్లుల మీద మండుతున్న వారంతా స్పందించటం మొదలు పెట్టారు. అత్యధికులు కరెంటు బిల్లులు వచ్చిన తీరును తప్పు పట్టారు.
సోషల్ మీడియాలో తమ మీద వ్యక్తమవుతున్న వ్యతిరేకతను గుర్తించిన టీఎన్ఈబీ రియాక్ట్ అయ్యింది. ప్రసన్నా.. మార్చి నెల నుంచి మీరు కరెంటు బిల్లు చెల్లించలేదు. అలా ఈ నాలుగు నెలలకు మీరు చెల్లించాల్సిన మొత్తం కరెంటు బిల్లు రూ.42,632. కరోనా కారణంగా మీటర్ రీడింగ్ తీయటం లేదని మేం ముందే వెల్లడించాం. అందుకు అనుగుణంగా ముందు నెలలో ఎంత బిల్లు వచ్చిందో.. అంతే మొత్తాన్ని మార్చిలో చెల్లించాలని కోరామని సుదీర్ఘ వివరణ ఇవ్వటంతో పాటు.. ప్రసన్నను కాసింత ఇరుకున పడేలా పోస్టు పెట్టింది.
దీనికి ప్రసన్న తగ్గకపోగా.. మరో పోస్టు చేశారు. వ్యక్తిగతంగా తనకొచ్చిన బిల్లును కట్టటానికి తనకేం సమస్య కాదని.. కరెంటు బిల్లు మొత్తాన్ని తాను చెల్లించినట్లుగా పేర్కొన్నారు. కానీ.. కరెంటు బిల్లు కట్టటంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియజేయటానికి తాను ప్రయత్నించానని.. ప్రభుత్వం ప్రజలకు బిల్లులు కట్టే విషయంలో కాస్తంత ఉపశమనం కలిగించాలంటూ పోస్టు చేశారు. తాను చేసిన ట్వీట్ తో విద్యుత్ ఉద్యోగులు.. ఇతర సిబ్బంది ఏమైనా ఇబ్బంది పడితే క్షమించాలని కోరారు. అయితే.. ఈ ట్వీట్లు మొత్తం సామాన్య ప్రజల తరఫున కావటం.. వారి ఈతిబాధలు తప్పేలా చూడటం కావటంతో.. ప్రసన్న ఇమేజ్ మరింత పెరిగితే.. విద్యుత్ శాఖకు మాత్రం ఈ వ్యవహారం మింగుడుపడనిదిగా మారింది. మొత్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక సినీ ప్రముఖుడు ఇలా రియాక్టు కావటం ఆసక్తికరంగా మారింది.