ఒక్క రోజు.. 425 మంది అవుట్

August 07, 2020

ఇండియాలో ఇప్పటిదాకా నమోదైన కరోనా కేసుల సంఖ్య 160 లోపే. అందులో చనిపోయింది ఇద్దరు మాత్రమే. దానికే మనం బెంబేలెత్తిపోతున్నాం. కానీ ఒక దేశంలో కేవలం 24 గంటల వ్యవధిలో 425 మంది కరోనా ధాటికి ప్రాణాలు వదిలారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయొచ్చు. ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఆ దేశం మామూలుగా అల్లాడట్లేదు. చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నడూ చూడని విషాదాన్ని ఇటలీ ఇప్పుడు చూస్తోంది. అక్కడ దేశవ్యాప్తంగా 25 శాతం మందికి పైగానే కరోనా బారిన పడటం గమనార్హం. ప్రతి నలుగురిలో ఒకరికి వైరస్ ఉందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే ఇటలీ వాసుల బాధ అర్థమవుతుంది.
కరోనా వైరస్ పుట్టిన చైనా తర్వాత అత్యధిక మరణాలు సంభవిస్తోంది ఇటలీలోనే. చైనాలో నివారణ చర్యలు ఉద్ధృతంగా చేపట్టడంతో అక్కడ ఇప్పటికే కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చింది. కానీ ఇటలీలో మాత్రం రోజు రోజుకూ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. ఇక్కడి నుంచి కరోనా బాధితుల్ని వాళ్ల సొంత దేశాలకు పంపించేస్తుండటంతో ఆయా దేశాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. మన దేశం మీద కూడా ఇటలీ ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. ఐతే ఇటలీ ఈ స్థాయిలో కరోనా ధాటికి అల్లాడుతుండటానికి మరో ముఖ్య కారణం ఉంది.

అక్కడి జనాభాలో వృద్ధుల శాతం ఎక్కువ. అది దాదాపు 25 శాతం అంటున్నారు. కరోనా 60 ఏళ్లు పైబడిన వాళ్ల మీదే ఎక్కువగా ప్రభావం చూపిస్తుండటం, ప్రాణాలు హరిస్తుండటం తెలిసిన సంగతే. అందుకే అక్కడ మరణాల రేటు అనూహ్య స్థాయిలో ఉంది. మరి ఇటలీలో కరోనా దెబ్బకు ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో.. అక్కడ పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందో చూడాలి మరి.