ఏపీ తిరుగులేని రికార్డు !!

June 02, 2020

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి అప్పుడే 10 నెలలు దాటిపోతోంది. ఈ పది నెలల కాలంలో సీఎంగా జగన్ తనదైన స్పీడుతో దూసుకెళ్లేందుకే యత్నించారని చెప్పక తప్పదు. ఈ దూకుడులో కొన్ని నిర్ణయాలు జగన్ ను ప్రజల్లో హీరోగా నిలబెట్టగా.. మరికొన్ని విషయాల్లో మాత్రం జగన్ ఘోరంగా విఫలమయ్యారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. సంక్షేమంలో తనదైన దూకుడుతో సరికొత్త పథకాలను ప్రవేశపెట్టిన జగన్... ఆయా రంగాల్లో జగన్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టాయి. ఇలా కోర్టుల్లో జగన్ ఇప్పటిదాాకా ఏకంగా 55 సార్లు దెబ్బైపోయారన్న విషయాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బయటపెట్టేసింది.

 

ఇప్పటికే చాలా విషయాల్లో కోర్టుల్లో చుక్కెదురైన జగన్ కు.. తాజాగా సర్కారీ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే దిశగా జారీ చేసిన రెండు జీవోను కొట్టేస్తూ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది. వాస్తవానికి సర్కారీ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో విపక్షాలకు కూడా పెద్దగా అభ్యంతరాలేమీ లేకున్నా... మాధ్యమం ఎంపికను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న జగన్ సర్కారు... అందరికీ ఆంగ్ల మాధ్యమమేనంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తరహా నిర్ణయాలు మాతృభాషకు గొడ్డలిపెట్టేనని అటు విద్యావేత్తలతో పాటు ఇటు విపక్షాలు విరుచుకుపడుతున్నా జగన్ సర్కారు పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. దీంతో ఈ వ్యవహారం హైకోర్టు మెట్లెక్కేసిందని చెప్పాలి.

 

ఇలా జగన్ సర్కారు తీసుకున్న ఓ కీలక నిర్ణయానికి సంబంధించిన జీవోలను కొట్టేస్తూ హైకోర్టు వెలువరించిన సంచలన తీర్పు నేపథ్యంలో.. అసలు జగన్ సర్కారుకు కోర్టులో ఎన్ని సార్లు ఎదురు దెబ్బలు తగిలాయన్న అంశంపై విపక్షాలు దృష్టి సారించాయి. ఇప్పటికే అమరావతి విషయంలో మూడు రాజధానులకు అనుకూలంగా జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. కర్నూలుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాన్ని తరలించేందుకు జారీ అయిన జీవోను కోర్టు కొట్టేసింది. అలాగే పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులేసిన వైనంపైనా జగన్ సర్కారును కోర్టు తప్పుబట్టింది. ఇక విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి పీపీఏలపై జగన్ తీసుకున్న నిర్ణయాలను కూడా కోర్టు తప్పుబట్టింది. వక్ఫ్ బోర్డు, పలు ఆలయాలకు సంబంధించిన పాలక మండళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్.. ఇలా చెప్పుకుంటూ పోతే... ఏకంగా 55 సార్లు హైకోర్టు జగన్ సర్కారుకు మొట్టికాయలు వేసిందట.