దేశాన్ని భయపెడుతున్న పంజాబ్ సీఎం

August 05, 2020

కేసుల సంఖ్య పంబాజ్ రాష్ట్రంలో బాగా తక్కువే. కానీ ఆ ముఖ్యమంత్రి అందరికంటే ఎక్కువ ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. అయితే... అవేమీ కొట్టిపారేయగలిగిన విషయాలేం కాదు. దేశంలో వైరస్ బాగా విస్తరిస్తోందని...లాక్ డౌన్ పొడిగించాలని, పొడిగిస్తారని కూడా తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక కరోనా ప్రభావం గురించి ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు వరకు కరోనా ప్రభావం ఈ ప్రపంచంపై ఉంటుందని తేల్చారు. అనేక పరిశోధనలను విన్న తర్వాత ఈ మాట చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇండియాలో 58 శాతం ప్రజలపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని కూడా పరిశోధనల్లో తేలిందని.. అంటే దీని ప్రభావం ఊహించనంత ఘోరంగా ఉంటుందన్నారు.

 ఇదిలా ఉండగా... 15 మంది తబ్లిగి ముస్లింలు తమ రాష్ట్రంలో తప్పించుకుని తిరుగుతున్నారని వారిని పట్టుకునే పనిలో ఉన్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. 132 కేసులు నమోదైన పంజాబ్ లో 651 మంది తబ్లిగి జమాత్ సమావేశానికి హాజరై తిరిగి వచ్చారు. ఇందులో 15 మంది తప్ప అందరూ దొరికినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో తక్కువ కేసులే ఉన్నా... మూడో దశలోకి వచ్చామని, సోర్స్ తెలియకుండా పంజాబ్ లో 27 మందికి వైరస్ సోకినట్టు ఆయన సంచలన ప్రకటన చేశారు. దీనిని కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (మూడో స్టేజి)గా భావిస్తున్నట్టు చెప్పారు. కరోనా రాష్ట్రంలో మూడో స్టేజికి రావడం వల్ల 87 శాతం మందికి కరోనా ఇన్ ఫెక్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. 

అసలు సెప్టెంబరు అంటే... మరో ఐదు నెలలు ప్రపంచం కరోనా వైరస్ ను ఎదుర్కోవడం అంత సాధారణమైన విషయమేం కాదు. ఇప్పటికే వేలాది మందికి ఉపాధిని ఇచ్చే అనేక పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. దీంతో చాలామందిని తొలగించడమో, జీతం తగ్గించడమో చేశారు. ఇలా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఆదాయంపై ఇది ప్రభావం చూపింది.