జానీ మాస్ట‌ర్ కు కోర్టు షాక్.. ఆ కేసులో ఆర్నెల్లు జైలు!

September 18, 2019

 ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్ గా పేరున్న షేక్ జానీ పాషా అలియాస్ జానీ మాస్ట‌ర్ కు కోర్టు షాకిచ్చింది. ఒక కేసులో ఆయ‌న‌కు ఆర్నెల్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది.మేడ్చ‌ల్ సీనియ‌ర్ సివిల్ కోర్టు న్యాయ‌మూర్తి ఇచ్చిన తీర్పు ప్ర‌కారం జానీ మాస్ట‌ర్ తో పాటు.. మ‌రో ఆరుగురికి సైతం జైలుశిక్ష‌.. జ‌రిమానా విధిస్తూ తీర్పును వెల్ల‌డించారు.
ఐదేళ్ల క్రితం (2014)లో మేడ్చ‌ల్ మండ‌లం కండ్ల‌కోయ ప‌రిధిలోని సీఎంఆర్ ఇంజ‌నీరింగ్ కాలేజీలో కొంద‌రు డ్యాన్స‌ర్ లు ఒక సీరియ‌ల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో డ్యాన్స్ మాస్ట‌ర్ జాతీ త‌న అనుచ‌రుల‌తో అక్క‌డ‌కు చేరుకున్నారు. అక్క‌డి వారితో గొడ‌వ ప‌డ్డారు.ఈ ఉదంతం అప్ప‌ట్లో స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.
గొడ‌వ‌తో పాటు.. అక్క‌డి వారిపై దాడికి పాల్ప‌డ్డారు. దీంతో బాధితులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జానీ మాస్ట‌ర్ తో స‌హా మ‌రో ఆరుగురిపై కేసులు న‌మోదు చేశారు. దీనికి సంబంధించిన చార్జిషీట్ కోర్టులో దాఖ‌లు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయ‌స్థానం జానీ మాస్ట‌ర్.. ఆయ‌న అనుచ‌రులుగా చెబుతున్న మ‌రో ఆరుగురికి ఆర్నెల్లు చొప్పున జైలుశిక్ష‌.. జ‌రిమానాను విధిస్తూ తీర్పును ఇచ్చారు.