భయం పెంచుతున్న నెంబర్లు !

August 11, 2020

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగుతోంది. అయితే, ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయడం వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. గత, నాలుగు రోజులుగా రోజుకు 6 వేలకు పైగా శాంపిల్స్ ను టెస్ట్ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో తెలంగాణలో టెస్టుల సంఖ్య తక్కువ కాబట్టి...కేసుల సంఖ్య కూడా తక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.

ఇక, ఏపీలో గత 24 గంటల్లో 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7727 శాంపిల్స్ ను పరీక్షించగా 73 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఏపీలో నమోదైన మొత్తం 1332 పాజిటివ్ కేసు లకు గాను 287 మంది డిశ్చార్జ్ అయ్యారు. 31 మంది కరోనాబారిన పడి మరణించారు. ప్రస్తుతం ఏపీలో కరోనా బారినపడి 1014 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 4, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 1, గుంటూరులో 29, కడపలో 4, కృష్ణాలో 13, కర్నూలులో 11, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 1, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇక, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,332కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 1897 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 73 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 7,695 మంది కోలుకోగా, ఆసుపత్రుల్లో 22,629 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 9,318కి చేరుకుంది. ఇప్పటివరకు 400 మంది మృతి చెందగా, 1,388 మంది కోలుకున్నారు. గుజరాత్‌లో 3,744 పాజిటివ్ కేసులకుగాను 181 మంది మృతి చెందారు. 434 మంది కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 3,314కి చేరుకుంది. కరోనా బారి నుంచి 1,078 మంది కోలుకోగా, 54 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో 2,387 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 377 మంది కోలుకోగా, 120 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజు 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1009కు చేరుకుంది.  కరోనా బారి నుంచి కోలుకొని 374 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహమ్మారి 25 మందిని బలి తీసుకుంది.  ఈ నెల 21 నుంచి తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని  రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మే 8 లోపు తెలంగాణలో కరోనా తగ్గిపోతుందని భావిస్తున్నట్టు చెప్పారు.