జగన్ ఈ బ్యాడ్ న్యూస్ తెలిసిందా నీకు ?

May 23, 2020

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 1 నుంచి జులై 23 వరకు 53 రోజుల్లో మొత్తం 75 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కౌలు రైతుల సంఘం ప్రకటించింది. ప్రతికూల పరిస్థితుల కారణంగా తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆ సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఆత్మహత్య చేసుకున్నవారి పేర్లు సహా వివరాలు తెలిపింది. జులై 1 నుంచి 23 మధ్యే ఏకంగా 56 మంది ప్రాణాలు తీసుకున్నారు.
వారు అందించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మంది.. ప్రకాశం జిల్లాలో 14, అనంతపురం, చిత్తూరుల్లో 8 మంది చొప్పున... కర్నూలులో ఏడుగురు, సీఎం సొంత జిల్లా కడపలో ఆరుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. పశ్చిమగోదావరిలో ఒకరు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లుగా కౌలు రైతుల సంఘం చెబుతోంది.
2011 కౌలు రైతుల చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులు, పంట రుణాలు, పెట్టుబడి సాయం, పంటల బీమా, రైతు బీమా ఇచ్చి కౌలు రైతులను ఆదుకోవాలని సంఘం నేతలు కోరుతున్నారు.. అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో రైతులు, కౌలు రైతుల సంఘాలు పర్యటించాలని, బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబాల జాబితాను సేకరించి కలెక్టర్లకు అర్జీలు ఇవ్వాలని, ప్రజాప్రతినిధు లను, మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లాలో 9 మంది చనిపోతే ఒక్కరికి కూడా పరిహారం అందలేదన్నారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం, యంత్రాంగం తప్పుల వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అప్పులు పెరగడం వల్ల మరో సారి అప్పు తీసుకునే అవకాశం కూడా లేకుండా పోతోందని చెప్పారు.

ప్రభుత్వం ప్రకటించిన రూ.ఏడు లక్షల సాయం సరిపోదని, రూ.పది లక్షలు ఇవ్వాలని, అప్పులన్నీ ప్రభుత్వమే చెల్లించాలని, రుణ విముక్తి చట్టం, గిట్టుబాటు ధరల చట్టాన్ని చేయాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతుల చట్టానికి సవరణలు చేయడం వల్ల కౌలు రైతులు నష్టపోతారన్నారు. ఒప్పంద పత్రం ఇచ్చినా బ్యాంకు రుణం వస్తుందన్న గ్యారెంటీ లేదన్నారు. నిపుణులు, కౌలు రైతులను సంప్రదించి కౌలు రైతుల చట్టానికి సవరణలు చేయాలన్నారు. సమస్యలను అందరూ కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, వారం రోజుల్లో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేయాలని సూచించారు.