కేరళ మరో సక్సెస్.. !

August 08, 2020

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. దేశంలోనే అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన కేరళ తన ప్రత్యేకతను ప్రదర్శిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. మహారాష్ట్ర తర్వాత ఆ రాష్ట్రంలోనే కేసులు ఎక్కువ. అయితే.. అనూహ్యంగా ఆ రాష్ట్రంలోని కరోనా పేషంట్లు విస్మయకర రీతిలో కోలుకుంటున్నారు. కరోనా పాజిటివ్ అయిన కేసుల్లో 70 ఏళ్లు దాటితే వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందన్నది తెలిసిందే.
అలాంటిది 90 ఏళ్లు దాటి.. పలు ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తి కరోనాను జయించటం అంటే మాటలు కాదు. ఆ అద్భుతాన్ని ఆవిష్కరించింది కేరళ. డబుల్ థమాకా అన్నట్లుగా 93 ఏళ్ల పెద్దాయన కరోనా ముప్పు నుంచి బయటపడటమే కాదు.. 88 ఏళ్ల ఆయన సతీమణి కూడా కోలుకున్నారు. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖా మంత్రి స్వయంగా వెల్లడించటం విశేషం.
వారిద్దరికి డయాబెటిస్.. హైపర్ టెన్షన్ లాంటి సమస్యలతో పాటు.. వయోభారం కారణంగా ఉండే సమస్యలు కూడా ఉన్నాయి. ఇలాంటివేళ.. ఆ వయసులోని వారు కరోనా జాయించటం మామూలు విషయం కాదు. కేరళలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పథనం తిట్ట జిల్లాలోని రాన్ని ప్రాంతానికి చెందిన ఈ దంపతుల పిల్లలు ఇటీవల ఇటలీ నుంచి వచ్చారు. అప్పటికే వారికి కరోనా సోకి ఉండటంతో..మిగిలిన కుటుంబ సభ్యులకు సోకింది. దీంతో.. ఈ ఇంట్లోని ఏడుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. తొలుత వారందరికి కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు.
వీరందరికి దాదాపు 40 మందితో కూడిన వైద్యుల టీం చికిత్సలు చేసింది. తొలుత పెద్ద వయస్కులైన దంపతుల ఆరోగ్యం బాగా క్షీణించినా.. వైద్యుల సలహాలు.. సూచనల్ని పక్కాగా పాటించటంతో వారు కరోనా ముప్పును అధిగమించారు. వైరస్ సోకినా.. మానసికంగా స్థైర్యం కోల్పోకుండా.. చికిత్సకు సహకరిస్తే ఈ వైరస్ ను జయించటం  తేలికైన విషయంగా చెప్పుకొచ్చారు. అయితే.. ఈ కుటుంబానికి చికిత్స చేసే సమయంలో ఒక నర్సుకు కరోనా వ్యాపించినట్లుగా గుర్తించారు. ఇది మినహా మిగిలిన మరే అంశం వారిని ఆందోళనకు గురి చేయలేదు. ఏమైనా.. కరోనా ధాటికి పెద్ద వయస్కులు తీవ్రంగా ప్రభావితం కావటమేకాదు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతున్న వేళ.. కరోనాపై యుద్ధానికి కేరళ ఉదాహరణ కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటం ఖాయమని చెప్పక తప్పదు.