జగన్ ‘ఇంగ్లిష్ మీడియం’కు మోడీ షాక్

August 03, 2020

గత మూడున్నర దశాబ్దాల్లో ప్రపంచం ఎంతగానో మారింది. మన దేశంలో.. మన ప్రజల జీవన విధానంలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లు మన విద్యా విధానం మాత్రం మారలేదు.

34 ఏళ్లుగా ఏ మార్పూ లేకుండా ఒకే విద్యా విధానాన్ని అనుసరిస్తున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వానికి కూడా ఈ దిశగా ఆలోచన రాలేదు. ఎట్టకేలకు నరేంద్ర మోడీ సర్కారు ఈ దిశగా అడుగులేసింది. పాత విధానానికి పాతరేసి కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడానికి ఆమోద ముద్ర వేసింది.

ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సంతకం కూడా చేశారు. కేబినెట్ ఆమోదమూ జరిగిపోయింది. ఇక ఈ విధానాన్ని అమల్లోకి తేవడమే తరువాయి. దేశ విద్యా వ్యవస్థలో ఇది ఓ పెను మార్పుకు దారి తీస్తుందని.. సానుకూల ఫలితాలు తెస్తుందని భావిస్తున్నారు.

మోడీ సర్కారు అమల్లోకి తేనున్న విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇవ్వబోతుండటం గమనార్హం. కొత్త విద్యా విధానం ప్రకారం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలన్నది నియమం. అంటే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింట్లోనూ విధిగా ఈ నియమాన్ని అమలు చేయాల్సిందే.

ప్రైవేటు పాఠశాలలు దీన్నెంత వరకు పట్టించుకుంటాయో కానీ.. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం కచ్చితంగా దీనికి కట్టుబడాల్సిందే. అంటే జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, పట్టుదలగా అమల్లోకి తేవాలని చూస్తున్న ఇంగ్లిష్ మీడియం విధానానికి మోడీ సర్కారు బ్రేక్ వేసినట్లే. ఆరో తరగతి నుంచి మాత్రమే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడానికి వీలుంటుంది.

కానీ ఐదో తరగతి వరకు తెలుగులో చదివి తర్వాతి ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం బోధనకు మారడమంటే అంత సులువు కాదు. మరి ఈ నియమానికి సంబంధించివిధి విధానాలేంటో.. జగన్ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.