ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫైనల్ ఫిగర్స్ ఇవే..

August 14, 2020

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం మూడు గంటల సమయానికి కొనసాగుతూనే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించిన వెలువడుతున్న ఫలితాలతో కమలనాథుల మోము చిన్నబోతే.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఆనందం అంతా ఇంతా కాదన్నట్లుగా మారింది. ఢిల్లీని చీపురు కట్టతో ఊడ్చేసిన తీరుతో బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు హాహాకారాలు చేస్తున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో అధిక్యతలో కొనసాగుతుంటే.. బీజేపీ కేవలం ఎనిమిది స్థానాలతో సింగిల్ డిజిట్ కే పరిమితమైన దుస్థితి.
దీనికి మించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తలకొట్టేసుకున్నట్లుగా మారింది. ఎందుకంటే.. గత ఎన్నికల్లోనే కాదు.. తాజా ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ గెలవకపోవటం ఆ పార్టీని తలెత్తుకోలేకుండా పోయిందని చెప్పాలి. తాజాగా ఎన్నికల ఫలితాలతో ఒక్క విషయం స్పస్టమైందని చెప్పాలి. రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగులేదన్న విషయాన్ని ఢిల్లీ ప్రజలు తమ ఓటుతో చెప్పేశారని చెప్పాలి.
మొత్తంగా చూసినప్పుడు ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు తమ నిర్ణయాన్ని విస్పస్టంగా వెల్లడించిన వైనం రాజకీయ పార్టీల్లో సంచలనంగా మారింది. ఐదేళ్ల పాలనతో సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు అధికారాన్ని అప్పజెప్పొచ్చు. ఢిల్లీని మినీ భారత్ గా పలువురు అభివర్ణిస్తారు. తాజా ఎన్నికల ఫలితాలు మోడీ పాలనకు ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు అనుకోవటం కూడా తొందరపాటే అవుతుంది. ఎందుకంటే.. తొమ్మిది నెలల క్రితమే క్లీన్ స్వీప్ చేసిన మోడీ పరివారానికి తాజా తీర్పు ఎంతకూ మింగుడుపడనిదిగా మారిందని చెప్పకతప్పదు.