ఆరోగ్య సేతు: నిజం ఇదే తెలుసుకోండి

August 13, 2020

ఆరోగ్య సేతు పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. ఆరోగ్య సేతు అనేది కరోనా వైరస్ నుంచి ప్రజలను అప్రమత్తం చేయడానికి, రక్షించడానికి ఉపయోగపడే యాప్ మాత్రమే అని పేర్కొంది. దీనివల్ల కరోనా విస్తరణ ఎలా ఉందనేది ప్రజలకు, ప్రభుత్వానికి తెలియడమే కాకుండా... మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడే మంచి సాధనం అని కేంద్రం పేర్కొంది. 

ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ ఒకరు ఆరోగ్యసేతు యాప్ పై చేసిన ఆరోపణను కూడా కేంద్రం కొట్టివేసింది. ఆరోగ్య సేతులో ప్రజలు ఇచ్చే సమాచారం ఆల్రెడీ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారమే గాని కొత్త సమాచారం కాదని... ఇది కేవలం కరోనా వారియర్ గా ప్రజలను కాపాడుతుందన్నారు. ఏ ఒక్కరికి దీనివల్ల ప్రమాదం అని ఇంతవరకూ ఎవరూ నిరూపించలేకపోయారని... దీనికి కారణం, అందులో ఏ తప్పు లేకపోవడమే అని అన్నారు. 

ఆరోగ్యసేతు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుందని, వినియోగదారుల ప్రైవసీకి ఎటువంటి భంగం ఉండదని ప్రభుత్వం పేర్కొంది. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీ దీనిపై విమర్శలు చేస్తూ వస్తోంది. అయినా... ప్రజలు వాడుతున్న ప్రైవేటు యాప్స్ తీసుకుంటున్న సమాచారం కంటే చాలా తక్కువ సమాచారం మాత్రమే ఇది తీసుకుంటోందన్నారు. లొకేషన్ బేస్డ్ గా రూపొందించిన ఈ యాప్ లొకేషన్ ట్రేస్ చేస్తారని ప్రచారం చేయడం ఏంటి... ఇది ఉద్దేశించినదే అందుకోసం. మీ కు దగ్గరలో ఉన్న కరోనా ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడటమే దీని ఉద్దేశం అయినపుడు లొకేషన్ వాడొద్దనడంలో అర్ధమే లేదన్నారు.

ఆరోగ్య సేతు గురించి వచ్చే విమర్శలపై బీజేపీ నేతలు కూడా స్పందించారు. గేమ్స్, ఉబర్, ఓలా, జొమాటో వంటి అనేక ప్రైవేటు యాప్ లకు అడిగిన సమాచారం అంతా ఇస్తున్న జనం... ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రజల ప్రయోజనం కోసం నిర్వహిస్తున్న యాప్ పై సమాచారం ఇస్తుంటే విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆరోగ్య సేతు కరోనా నుంచి మనదేశాన్ని కాపాడే యాప్, దాని గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం ఏ మాత్రం సబబు కాదని బీజేపీ నేతలు విమర్శించారు.