బిగ్ బ్రేకింగ్... ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు

February 25, 2020

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయాలు అమలైపోతున్నాయి. ఇప్పటికే ఈ దిశగా లెక్కలేనన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్ ప్రభుత్వం... తాజాగా ఆ సంచలనాలన్నింటి కంటే కూడా పెను సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏకంగా సర్వీసుల నుంచి సస్పెండ్ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసు నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవటమే కారణమని ప్రభుత్వం సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. భద్రతా ఉపకరణాల కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజా ప్రయోజనాల రీత్యా వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్‌ వేటు పడినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వర రావు1989 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా వ్యవహరించిన ఏడీపై వైసీపీ లెక్కలేనన్ని ఆరోపణలు చేసింది. పోలీసు అధికారిగా కాకుండా టీడీపీ సర్కారులో ఓ పవర్ సెంటర్ గా ఏబీ వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన చాలా మంది టీడీపీ తీర్థం పుచ్చుకోవడంలోనూ ఏబీ కీలకంగా వ్యవహరించారని ఆరోపించింది. అంతేకాకుండా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఓటర్లను ప్రభావితం చేసేలా ఏబీ వ్యవహరిస్తున్నారని ఆయనపై నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఏబీని ఈసీ ఇంటెలిజెన్స్ నుంచి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికలు ముగిశాక...అధికారం చేపట్టిన జగన్.. ఏబీకి ఎలాంటి పదవీ ఇవ్వలేదు. ఈసీ ఆదేశాలతో ఇంటెలిజెన్స్ నుంచి ఏసీబీ డీజీగా బదిలీ అయిన ఏబీ... ఆ పదవిలో అలా చేరారో, లేదో... జగన్ సర్కారు ఆయనను అక్కడి నుంచి కూడా బదిలీ చేసిపారేసింది. ఏసీబీ డీజీగా ఉన్న ఏబీని అక్కడి నుంచి బదిలీ చేసిన జగన్ సర్కారు... ఎలాంటి పోస్టు ఇవ్వకుండానే... పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో నొచ్చుకున్న ఏబీ... కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు యత్నించారన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన పేరు ఎక్కడా వినిపించలేదు. తాజాగా ఏబీని సస్పెండ్ చేస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవడంతో మరోమారు ఏబీ సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారారు.