ఏబీ డేర్.. జగన్ కు మరో మొట్టికాయ తప్పదంతే

July 03, 2020

ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోమారు కోర్టుల్లో మొట్టికాయలు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ను రాత్రికి రాత్రే సస్పెండ్ చేసి ఇప్పుడు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ లో నానా అవస్థలు పడుతున్న సర్కారు... అదే తరహాలో ఏబీ సస్పెన్షన్ కారణంగా కొత్త చిక్కులు తప్పవన్న వాదన వినిపిస్తోంది. ఈ మేరకు తన సస్పెన్షన్ పై ఘాటుగా స్పందించిన ఏబీ... తన సస్పెన్షన్ కు సంబంధించి జగన్ సర్కారుపై న్యాయ పోరాటం చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

శనివారం రాత్రి పొద్దుపోయాక ఏబీని సస్పెండ్ చేస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఏబీపై విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు... ఆ విచారణ పూర్తి అయ్యేదాకా హెడ్ క్వార్టర్స్ ను వదిలి వెళ్లరాదని కూడా ఆదేశాలు జారీ చేసింది. అచ్చూ కృష్ణ కిశోర్ విషయంలోనూ జగన్ సర్కారు ఇదే తరహాలో చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. కృష్ణ కిశోర్ ను సస్పెండ్ చేసిన జగన్ సర్కారు... ఆయనపై విచారణకు ఆదేశాలు జారీ చేసి విచారణ పూర్తయ్యేదాకా హెడ్ క్వార్టర్స్ ను వదిలి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై క్యాట్ ను ఆశ్రయించిన కృష్ణ కిశోర్... జగన్ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

తాజాగా ఏబీ వెంకటేశ్వరరావును కూడా కృష్ణ కిశోర్ మాదిరే సస్పెండ్ చేసిన జగన్ సర్కారు.. ఆయనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. జగన్ సర్కారు నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు తెలిసిన వెంటనే ఏబీ చాలా డేరింగ్ గా స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఏబీ ఏమన్నారంటే... ‘‘బంధు మిత్రులను హితులను ఉద్దేశించి.. రాష్ట్ర ప్రభుత్వం నన్ను సస్సెండ్ చేస్తూ  ఇచ్చిన ఉత్తర్వుల కబురు మీ వరకు చేరే ఉంటుంది. మీడియాలో వస్తున్న కథనాలలో వాస్తవం లేదని మీ అందరికి తెలియజెప్పడం ఈ ప్రకటన ఉద్దేశం. దీని వల్ల మానసికంగా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మీరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ చర్యను  ఎదుర్కొనేందుకు చట్టపరంగా నాకున్న అవకాశాలను పరిశీలిస్తున్నాను.తదుపరి ఏమిటనేది క్రమంగా మీకే తెలుస్తుంది’’ అని ఏబీ ఆ ప్రకటనలో వివరించారు.