అచ్చెన్నాయుడికి బెయిల్ నిరాకరణ - రేపు సంచలనం? 

August 10, 2020

ఈఎస్ఐ స్కాములో అవకతవకల కేసు కింద బీసీ ఉత్తరాంధ్ర నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు బెయిలు నిరాకరించింది. కొన్ని రోజుల క్రితమే ఇందులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వులో పెట్టిన జడ్జి తాజాగా బెయిలును నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు.

దీంతో ఆపరేషన్ అనంతరం స్వతంత్రంగా తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్న అచ్చెన్నాయుడుకి తీవ్ర నిరాశ ఎదురైంది.  బెయిలు రాకపోవడంపై తెలుగుదేశం శ్రేణులు, అచ్చెన్నాయుడి కుటుంబం తీవ్ర నిరాశ చెందారు.

వాదనలు వినిపించినపుడు అచ్చెన్నాయుడు ఎపుడు కావాలంటే అపుడు హాజరవుతారని చెప్పినా కోర్టు వారి వాదనలను విస్మరించింది. అచ్చెన్నాయుడు లాయరు వాదనతో ఏసీబీ న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. దీంతో తాజాగా బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.

మరోవైపు ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో కూడా పిటిషను దాఖలైంది.  అనారోగ్యంతో బాధపడుతున్న తనను ఆస్పత్రిలో ఉంచాలని కోరుతూ అచ్చెన్నాయుడు లాయరు ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషనులో విచారణ జరిగింది. ఈరోజు వాదనలు ముగిశాయి. ఆయన స్వంతంగా దైనందిన కాల కృత్యాలు తీర్చుకునే స్థితిలో కూడా లేరు అని అచ్చెన్నాయుడు తరఫు లాయరు వాదించారు.  మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే ఆదేశాలు ఇవ్వాలని వాదన వినిపించారు.

ప్రభుత్వ తరఫు లాయరు అచ్చెన్నాయుడికి పూర్తిస్థాయిలో చికిత్స జరిగిందని, మెరుగైన వైద్యం అందించామని వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయనకు ఇతర వైద్యం అవసరంలేదని వాదించారు. దీనిపై రేపు తీర్పు వెలువడనుంది.