బాబుపై ఏసీబీ విచారణ... వాట్ నెక్ట్స్ ??

July 12, 2020

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై ఏసీబీ కోర్టు విచారణ అంటూ వైరి వర్గాలు సంబరపడిపోతున్న వైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు రెండో సతీమణి లక్ష్మీపార్వతి ఏళ్ల క్రితం దాఖలు చేసిన ఓ పిటిషన్ ఆధారంగా ఇప్పుడు చంద్రబాబుపై ఏసీబీ విచారణ ప్రారంభమైపోయిందంటూ వైరి వర్గాలు... ప్రత్యేకించి వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మొత్తంగా బాబు వ్యతిరేక వర్గంలో ఈ వార్తలు కాస్తంత జోష్ ను నింపాయనే చెప్పాలి. అయితే ఈ జోష్ ఎంతకాలం అన్నదే అసలు సిసలు ప్రశ్నగా మారిందని కూడా చెప్పక తప్పదు.

చంద్రబాబు అధికారం దిగిపోయిన ప్రతి సారీ ఈ తరహా ఆరోపణలు వినిపిస్తున్న వైనాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం పదవి చేపట్టగానే... చంద్రబాబుపై విచారణలు చేపట్టాలంటూ లెక్కలేనన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ పిటిషన్లలో ఒక్కటి కూడా నిలిచి గెలిచిన దాఖలా లేదు. అసలు ఆ పిటిషన్లకు విచారణార్హతే లేదన్న వైనం కూడా మనకు తెలియనిదేమీ కాదు. ఈ నేపథ్యంలో ఎప్పుడో ఆరేళ్ల క్రితం... అది కూడా చంద్రబాబు విపక్షంలో ఉండగా లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ అంత ఈజీనేనా? అంటే అదేమంత ఈజీ కాదనే మాట గట్టిగానే వినిపిస్తోంది.

నాడు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ పై అప్పుడే చంద్రబాబు స్పందించారు. లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ పై చంద్రబాబు కూడా నేరుగా కోర్టునే ఆశ్రయించి తన వైఖరి ఏమిటో చెప్పేశారు. తాను అధికారంలో ఉండగా అంతా సైలెంట్ గానే ఉండే తన ప్రత్యర్థులు సరిగ్గా... ఎన్నికలు సమీపిస్తున్నాయనగానే... తనపై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని తన రిట్ పిటిషన్ లో చంద్రబాబు తెలిపారు. ఈ తరహా పిటిషన్ల ద్వారా తనను వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగానూ ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా చేసుకుని ఈ తరహా పిటిషన్లు వస్తున్నాయని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వాదన సహేతుకంగానే ఉన్నదని గుర్తించిన హైకోర్టు... లక్ష్మీపార్వతి పిటిషన్ పై విచారణ జరపాల్సిన అవసరం లేదని తేల్చేసింది. 

తాజాగా ఇప్పుడు కూడా గతంలో మాదిరిగానే చంద్రబాబు పదవి దిగిపోగానే... ఆయనను ఇబ్బందులకు గురి చేసేలా జరుగుతున్న ఈ తంతు కూడా ముందుకు సాగేది లేదన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యర్థులు వేసే పిటిషన్ల మాట ఇలా ఉంటే... రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఏ ఒక్క రాజకీయ నేత చేయని విధంగా ఏటా చంద్రబాబు తన ఆస్తులతో పాటు తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నారు. మరి ఏటా ఆస్తుల వివరాలు ప్రకటిస్తున్న చంద్రబాబుకు... ఆదాయానికి మించి ఆస్తులు ఎలా కనిపించాయో లక్ష్మీపార్వతే చెప్పాలి. అంతిమంగా ఈ సారి కూడా ప్రత్యర్థులు చంద్రబాబుపై విచారణకు చేస్తున్న యత్నాలన్నీ నిష్ఫలమేనని చెప్పక తప్పదు.