ఆసుపత్రిలో తెలుగు విలన్.. సాయం చేసిన తమిళ హీరో

August 04, 2020

రీల్ కు రియల్ కు మధ్య ఉండే తేడా అందరికి తెలిసిందే. హీరోను అదే పనిగా ఇబ్బంది పెట్టే విలన్ .. దాన్ని ఎదుర్కొనేందుకు హీరో చేసే ప్రయత్నాలు. ఇలా సాగే రీల్ జీవితాన్ని కాస్త పక్కన పెడితే.. రీల్ మనుషులు రియల్ గా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటి వేళలో ఏం జరుగుతుందన్న విషయానికి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన ఒక విషయం అందరిని ఆకర్షిస్తోంది.

తెలుగు.. తమిళ చిత్రాల్లో విలన్ గా నటించిన పొన్నంబళమ్ తాజాగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో చెన్నైలోని చికిత్స పొందుతున్న అతడు.. ప్రస్తుతం ఆక్సిజన్ మీద ఆధారపడి ఉన్నారు. ఆయన పరిస్థితి బాగోలేదన్న విషయాన్ని తెలుసుకున్న స్టార్ హీరో కమల్ హాసన్ వెంటనే స్పందించారు. ఆయన పరిస్థితి గురించిన సమాచారం అందిన వెంటనే ఆర్థిక సాయం అందిస్తానని చెప్పటమే కాదు.. వారి పిల్లల్ని చదివించే బాధ్యత తాను తీసుకుంటానని మాటిస్తారు.

ఆసుపత్రిలో ఉన్న పొన్నంబళమ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని పరిస్థితి చూసిన వారంతా కదిలిపోతున్నారు. అయ్యో అని బాధ పడుతున్న వారే. ఇదలాఉంటే.. ఈ రీల్ విలన్ ఆరోగ్య పరిస్థితి గురించి కమల్ టీం సభ్యులు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నట్లు చెబుతున్నారు. వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.