మీడియా ముందుకు వచ్చిన శివాజీ

April 01, 2020

శివాజీ పరారీలో ఉన్నాడంటూ వస్తున్నా వార్తలపై నటుడు శివాజీ స్పందించారు. తాను ఎక్కడికీ పోలేదని వడదెబ్బతో విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన వెల్లడించారు. అనంతరం పోలీసులు-టీవీ9 వ్వవహారంపై స్పందించారు.
"ఇది రవిప్రకాశ్ కు నాకూ మధ్య ఉన్న విషయం. షేర్ల విషయంలో ఉన్న పంచాయితీ ఇది. ఈ సివిల్ పంచాయితీని కాస్తా క్రిమినల్ వ్యవహారంగా మార్చడానికి మధ్యలో ఈమెయిల్స్ తీసుకొచ్చారు. డిలీట్ చేసిన ఈమెయిల్స్ రికవర్ చేసినవాళ్లకు అందులో లేని పదాలను యాడ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇదో కుట్ర. 2018 ఫిబ్రవరిలో నాకూ రవిప్రకాశ్ కు మధ్య అగ్రిమెంట్ జరిగింది. అదే ఒప్పందాన్ని ఇటీవలే తిరగరాసుకున్నాం. ఇది సాధారణమైన విషయమే. సంస్థలోకి కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు నా ప్రయోజనాలను కాపాడుకునేందుకు నేను ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదు.‘‘ ఇదీ శివాజీ స్పందన.
ఇంకా ఆయన పలు ఆరోపణలు చేశారు. పోలీసులు, సోదాల పేరిటో తనపై కొందరు పగబట్టారని, అందుకోసం కుటుంబ సభ్యులను భయపెడుతున్నారని అన్నారు. శివాజీ ఎవ్వడికీ భయపడడు. సెటిలర్లం కాబట్టి, తమకు స్థానబలం లేదని తమపై హైదరాబాదు పోలీసులు కేసులు పెట్టి లోపల వేసేస్తారా? అంటూ శివాజీ ప్రశ్నించారు. తాను భయపడి పారిపోవడానికి ఇదేమైనా పెద్ద కేసా? అంటూ శివాజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులు వంద పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ కొన్నిరోజుల వ్యవధిలోనే తాను తిరుపతి వెళ్లాను. ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. సివిల్ పంచాయతీని పట్టుకుని రాష్ట్ర సమస్యలా భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు అని శివాజీ అన్నారు.