సినిమా హిట్... ఫ్యాన్స్ ఫ్లాప్ - హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

February 23, 2020

దీపావళి వేళ భారీ అంచనాల మధ్య విడుదలైన విజయ్ బిగిల్ (తెలుగులో విజిల్) చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఈ చిత్ర విడుదల సమయంలో ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారింది. ఎంత ఫ్యాన్స్ అయితే మాత్రం ఇష్టం వచ్చినట్లు చేస్తారా? ఇదెక్కడి పద్దతి అంటూ మండిపడుతున్నారు. ఫ్యాన్స్ కోసం ప్రత్యేక షో వేసేందుకు థియేటర్ వర్గాలు నో చెప్పటంతో కృష్ణగిరిలో విజయ్ అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
సదరు థియేటర్ ను ధ్వంసం చేయటమే కాదు.. దగ్గర్లోని షాపులకు నిప్పు పెట్టటం.. వాహనాల్ని తగలబెట్టటం లాంటి ఘటనలతో ఆరాచకం చేశారు. పోలీసుల ఎంట్రీతో ఈ గొడవలకు పాల్పడినట్లుగా భావిస్తున్న 30 మందిని అరెస్ట్ చేసి జైల్లో వేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తమ అభిమాన నటుడిపై అభిమానం ఉండటం తప్పేం కాదు కానీ.. ఇలా హద్దులు దాటటం ఏ మాత్రం సరికాదంటున్నారు.
ఈ ఇష్యూ మీద నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణగిరి ఎపిసోడ్ ను తీవ్రస్థాయిలో తప్పు పట్టిన ఆమె.. సినిమా ఎంత హిట్ అయినా.. ఈ సినిమా విడుదల సమయంలో చోటు చేసుకున్న ఆరాచకం మాత్రం అలానే నిలుస్తుందని స్పష్టం చేశారు.
కృష్ణగిరి ఘటన విజయ్ వైరి వర్గం చేసిందని చెబుతున్నా.. వాస్తవం మాత్రం వారి మనసులకు తెలుసన్న ఆమె.. . నిజమైన అభిమానులు తాను అభిమానించే నటులను ఇంతగా చెడ్డ పేరు తెచ్చే చర్యలకు పాల్పడరని మండిపడ్డారు. అసలే విజయ్ అభిమానులు. ఇప్పటికే మండిపోతున్నారు. ఇలాంటి వేళ.. కస్తూరి లాంటి నటీమణులు వ్యాఖ్యలు చేయటం సబబేనా? అంటూ పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.