అమరావతి పోరాటంలో పాల్గొంటా: తెలంగాణ నేత

July 08, 2020

ఏపీలో రాజధాని మార్పు అంశం సెగలు రేపుతున్నవేళ తెలంగాణకు చెందిన ఓ యువనాయకుడు తాను కూడా అమరావతి రైతులకు మద్దతుగా రాజధాని పోరాటంలో పాల్గొంటానని ప్రకటించి సంచలనం రేపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఆ నాయకుడు తాను అమరావతిలో జరుగుతున్న పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ప్రకటించారు. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని మార్చడాన్ని వ్యతిరేకిస్తూ.. అక్కడి ప్రజలు చేస్తోన్న పోరాటంలో తాను కూడా పాల్గొంటానని తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన అమరావతిలో రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు చూసి స్పందించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు నడుచుకోరాదని.. తెలుగు నేలపై ఎక్కడ ప్రభుత్వాలు అలాంటి పనిచేసినా తాను ప్రజల తరఫున నిలుస్తానంటూ ఆయన అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు.
మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్నారు. ఉద్యమకారులపట్ల పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. కేంద్రం వెంటనే కల్పించుకుని పెద్దన్న పాత్రను పోషించాలని కోరారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఒకే తానులోని ముక్కలన్నారు. అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీ ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ప్రజల అభీష్టాన్ని కాదని ప్రభుత్వం ఏకపపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రజాగ్రహం చవిచూడడం ఖాయమన్నారు. 

Read Also

హైదరాబాద్‌లో ఇరాన్, అమెరికా యుద్ధం మంటలు
మోడీ దొరికాడు... జగన్ బాబుని వదిలేస్తాడా
జగన్ కి బ్రేక్ పడింది