తిట్టకుండా... బాబును ఇరికించిన ఆది

May 29, 2020

వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన నేత, మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి... ఇప్పుడు మరోమారు పార్టీ మారుతూ బీజేపీలోకి చేరిపోతున్నారు. ఈ మేరకు గత కొంతకాలం నుంచి ఆది పార్టీ మారుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నా... నిన్న స్వయంగా ఆదినారాయణరెడ్డే స్వయంగా తాను పార్టీ మారుతున్నట్లుగా, టీడీపీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరుతున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. తన రాజకీయ ప్రస్థానంలోనే మంత్రి పదవి కట్టబెట్టిన టీడీపీకి షాకిస్తూ... ఆది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయాయి.

తొలుత కాంగ్రెస్ నేతగా ఉన్న ఆదినారాయణ రెడ్డి... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి ప్రోత్సాహంతో జమ్మలమడుగులో మంచి పట్టున్న టీడీపీ నేత రామసుబ్బారెడ్డిని చిత్తుగా ఓడించి సంచలనం రేపారు. ఆ తర్వాత వైఎస్ అకాల మరణం చెందడం, ఆయన కుమారుడు వైసీపీ పేరిట కొత్త పార్టీ పెట్టడం, ఆదినారాయణ రెడ్డి కూడా అందులో చేరిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైనా జగన్ మాదిరే ఆది కూడా జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు లోనైన ఆది.. టీడీపీలో చేరి మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబు సూచనతో చిరకాల ప్రత్యర్థి రామసుబ్బారెడ్డితో సఖ్యతగానూ మెలిగారు.

తాజాగా 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా... ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. అంతేకాకుండా టీడీపీ తన చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. దీంతో సమీకరణాలు మారిపోగా... ఆది బీజేపీ వైపు చూశారు. ఆది త్వరలోనే బీజేపీలో చేరతారన్న వార్తలు కలకలం రేపాయి. ఈ క్రమంలో నిన్న మీడియా ముందుకు వచ్చిన ఆది... టీడీపీకి షాకిచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరిపోవడం ఖాయమేనని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే తాను నిర్ణయం తీసుకున్నానని, బీజేపీ నేతలతో మాట్టాడి ముహూర్తం ఖారారు చేయాల్సి ఉందన్నారు.

అంతటితో ఆగని ఆది... తాను పార్టీ మారుతున్నట్లుగా తానే స్వయంగా చంద్రబాబుకు చెప్పానని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిని వెంటబెట్టుకుని మరీ చంద్రబాబు వద్దకు వెళ్లానని, చంద్రబాబుతో తాను పార్టీ మారే విషయం చర్చించానని కూడా ఆయన వెల్లడించారు. పార్టీ మారాల్సిన అవసరం లేదని చంద్రబాబు సూచించగా... తన వర్గంతో చర్చించి చెబుతానని మాత్రమే తెలిపానని, పార్టీ మారే నిర్ణయంపై వెనక్కు తగ్గినట్లుగా వచ్చిన వార్తలన్నీ నిరాధారమైనవేనని ఆది తెలిపారు. ఈ తరహా వ్యాఖ్యలతో ఆయన టీడీపీ అధిష్ఠానానికి షాకిచ్చారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.