ముహూర్తం కుదిరింది... బీజేపీలోకి ఆది

July 09, 2020
CTYPE html>
తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ, ఆ తర్వాత టీడీపీ... ఇప్పుడేమో బీజేపీ... ఇదీ జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రస్థానంగా చెప్పుకోవాలేమో. నిజమే... తొలుత కాంగ్రెస్ లో ఉన్న ఆదినారాయణ రెడ్డి రెండు సార్లు రెండు పార్టీలు మారి... ఇప్పుడు ముచ్చటగా మూడో సారి నాలుగో పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆదినారాయణ రెడ్డి నేడు లేదా రేపు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరిన ఆదినారాయణ రెడ్డి... ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ పార్టీలోకి చేరిపోతున్నారట.
2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టినా... వైసీపీ తరఫున జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆది విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ విసిరిన ఆపరేషన్ ఆకర్ష్ కు ఆయన పడిపోయారు. టీడీపీలో చేరి ఏకంగా మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. నాడు టీడీపీలో చేరిన సందర్బంగా కుదిరిన ఒప్పందం మేరకు 2019 ఎన్నికల్లో కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి... వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడారు.

గడచిన ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆదినారాయణ రెడ్డి... బీజేపీలోకి చేరిన టీడీపీ కీలక నేతలతో టచ్ లో ఉన్నారన్న వార్తలు వినిపించాయి. అంతేకాకుండా బీజేపీలోకి చేరిపోయేందుకు నిర్ణయం తీసేసుకున్న ఆది... ఆ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా చెప్పేశారన్న వార్తలు కూడా వినిపించాయి. తాను రాజకీయంగా మనుగడ సాగించాలంటే బీజేపీలోకి చేరడం మినహా గత్యంతరం లేదన్న విషయాన్ని బాబుకు చెప్పిన ఆది... బీజేపీ అధిష్ఠానంతో మంతనాలు సాగించారట. ఈ క్రమంలో బుధవారం ఢిల్లీకి వెళ్లిన ఆదినారాయణ రెడ్డి బీజేపీ కీలక నేతలను కలిసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకునేందుకు కూడా ఆది ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. 
గతంలో వైసీపీకి చుక్కలు చూపించిన ఆది...  ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు. వైసీపీ నేతలు ఈసారి ఓ పట్టుపట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకే వైసీపీ నేతలపై పై చేయి సాధించడానికి ఆయన బీజేపీలోకి పోెతున్నారన్న వాదన ఉంది.