ఆమెకు రాహుల్ గాంధీ సర్ ప్రైజ్

July 06, 2020

తాజాగా కేర‌ళ‌లో ప‌ర్య‌టిస్తున్న కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఒక పెద్దావిడ ఇంటికి అతిథిగా వెళ్లి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. సుదీర్ఘ కాలంగా తాను ఎవ‌రి కోసం అయితే ఎదురుచూస్తున్నానో.. ఆ వ్య‌క్తే నేరుగా త‌న ఇంటికి రావ‌టంతో ఆ పెద్దావిత భావోద్వేగానికి గురైంది.రాహుల్ ను చూసినంత‌నే.. అవ‌ధుల్లేకుండా పోయిన ఆనందంతో ఆమె ఆయ‌న్ను ఆలింగ‌నం చేసుకున్నారు.
ఇంత‌కీ వ‌య‌నాడ్ లో రాహుల్ క‌లిసింది ఎవ‌రినో తెలుసా? తాను పుట్టిన‌ప్పుడు తొలిసారి త‌న‌ను ఎత్తుకున్న న‌ర్సు రాజమ్మను. రాహుల్ పౌర‌స‌త్వం మీద వివాదం చెల‌రేగిన‌ప్పుడు.. వ‌యునాడుకు చెందిన ఈ రిటైర్డ్ న‌ర్సు ధైర్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి రాహుల్ భార‌తీయుడ‌ని.. ఆయ‌న భార‌త్ లోనే జ‌న్మించాడ‌ని చెప్ప‌ట‌మేకాదు.. కాన్పు త‌ర్వాత రాహుల్ ను ఎత్తుకున్న తొలి న‌ర్సును త‌న‌నేనని పేర్కొన్నారు.
త‌న చేతుల‌తో ఎత్తుకున్న రాహుల్.. వ‌యునాడ్ నుంచి పోటీ చేయ‌టాన్ని ఆమె పూర్తిగా స‌మ‌ర్థించ‌ట‌మే కాదు.. తాను ఆయ‌న్ను క‌ల‌వాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాన‌ని.. ఏదో ఒక రోజు తాను ఆయ‌న్ను కలుస్తాన‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఇదిఇలా ఉంటే.. వ‌యునాడ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్.. త‌న‌ను ఎత్తుకున్న న‌ర్సు ఇంటికి వెళ్లి ఆమెను ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.ఆమె ఆరోగ్యం గురించి రాహుల్ ఆరా తీశారు. త‌న ఇంటికే రాహుల్ రావ‌టంతో ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.