మోదీ తన ప్రగాఢ వాంఛను పక్కనపెట్టేశారా?

May 27, 2020

మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో ఊహించని షాక్ తగలడంతో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రగాఢ వాంఛను పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ పేరుతో ఆయన పార్లమెంటు, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు కొన్ని రాష్ట్రాలు ఓకే చెప్పగా మరికొందరు వ్యతిరేకిస్తున్నా ఆయన మాత్రం జమిలి ఎన్నికల నిర్వహణ కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే... తాజాగా రెండు రాష్ట్రాల్లో తిరుగులేని విజయం సాధిస్తామని గట్టి నమ్మకం పెట్టుకున్న తరుణంలో సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా ప్రజలు తీర్పు ఇవ్వడంతో పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.
2023లోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోడీ యోచిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మధ్యలో ఆగిపోయే ప్రభుత్వాలను పొడిగించడం.. కొన్ని రాష్ట్రాలకు ముందస్తు ఎన్నికలు జరిపేందుకు మోడీ రాజ్యాంగ సవరణకు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల ఎన్నికల్లో హర్యానాలో హంగ్ రావడం.. మహారాష్టలో 100 సీట్లకే పరిమితమవ్వడం చూశాక బీజేపీ నేతల్లో పునరాలోచన మొదలైనట్టు కనిపిస్తోంది. అధికారం చేపట్టిన 5 నెలల్లోనే వచ్చిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం అటుంచి కనీసం సొంతంగా అధికారంలోకి కూడా రాలేని దుస్థితిలో పడిపోవడంతో కమలనాథులు జమిలిపై ఆలోచిస్తున్నారట.
2019 సార్వత్రిక ఎన్నికలకు, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఏకంగా 9శాతం ఓటు బ్యాంకు తగ్గడం చూస్తే బీజేపీ వ్యతిరేకత చాలా పెరిగిందని తేలింది. మరి 2023లోనే ఎన్నికలకు వెళితే రాష్ట్రాలను కొల్లగొట్టడం కాదు కదా కేంద్రంలో అధికారంలోకి రాకుండా పోతామేనన్న భయం మొదలైనట్లుగా తెలుస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి నిర్ణయం తీసుకోవాలని.. అంతవరకు కాస్త తగ్గాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట.