ఆ దేశాధ్యక్షుడికి షాకిచ్చిన ఎయిరిండియా

August 12, 2020

విదేశాలకు వెళ్లిన సమయంలో మన రాజకీయ ప్రముఖులకు.. సినీ సెలబ్రిటీలకు దారుణమైన అవమానం జరిగిందంటూ వార్తలు వస్తుంటాయి. మనోళ్ల లగేజీ విషయంలోనూ.. బాడీ స్కాన్ చేయటాన్ని తీవ్రంగా తప్పు పడుతుంటాం. కానీ.. అలాంటి పనే మన దగ్గర జరిగితే? తాజాగా అలాంటి ఉదంతమే ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ అధ్యాత్మిక కేంద్రమైన వారణాసి ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది.
మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్సింగ్ రూపన్ భారత్ లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన వారణాసికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఎయిర్ పోర్టు అధికారులు అధ్యక్షుల వారి లగేజీ ఎక్కువైందని అడ్డుకున్నారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు చేరటం.. వారు వెంటనే రియాక్ట్ కావటంతో డ్యామేజ్ కంట్రోల్ చేశారు. అయితే.. అప్పటికే అధ్యక్షుల వారికి చేదు అనుభవం తప్పలేదు.
పరిమితికి మించిన లగేజ్ ను అనుమతించకూడదన్న రూల్ బుక్ లోని రూల్ ప్రకారం తాము వ్యవహరించినట్లుగా ఎయిరిండియా అధికారులు చెబుతున్నప్పటికీ.. ఎప్పుడెలా వ్యవహరించాలన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. దేశానికి వచ్చిన అతిధులు.. అందునా.. ఒక దేశ అధ్యక్షుడి విషయంలో ఎయిరిండియా సిబ్బంది ఇలా వ్యవహరిస్తారా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.
వారణాసి ఎయిర్ పోర్టులో మారిషస్ అధ్యక్షుడితో పాటు మరో ఆరుగురు ప్రతినిధులు ఉన్నారు. రెండు రోజుల పర్యటనను ముగించుకొని వెళుతున్న వేళ.. లగేజీ ఎక్కువగా ఉన్న కారణంగా వారిని అదనంగా చెల్లింపులు చేయాలని కోరారు. ఇలాంటి సున్నితమైన అంశాల్లో రూల్ ను ఫాలో కావటం కంటే కూడా.. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశానికి చెందిన ప్రముఖులు విదేశీ పర్యటనల సందర్భంగా ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు ఆవేశానికి.. ఆగ్రహానికి గురయ్యే మనం.. మారిషస్ దేశాధ్యక్షుడికి ఎదురైన చేదు అనుభవం లాంటివి చూస్తే.. తలతిక్క అధికారులతోనే ఇలాంటివి చోటు చేసుకుంటాయన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.