చంద్రబాబు వస్తాడని ఎయిర్ పోర్టులు మూసేశారు !!

August 07, 2020

ఏపీలో అధికార పార్టీ చంద్రబాబు చుట్టూ తిరుగుతోందా? చంద్రబాబు ప్రస్తావన లేకుండా సీఎం నుంచి కార్యకర్త వరకు ఏపనీ చేయడం లేదా? అంటే అవుననే అనిపించేలా ఉన్నాయి పరిణామాలు. దేశ వ్యాప్తంగా రేపటి నుంచి భారత ప్రభుత్వం విమాన ప్రయాణం అందుబాటులోకి తెచ్చింది. కొద్ది గంటల క్రితం వరకు ఏపీలో విమానాలు తిరగాల్సి ఉంది. అయితే సడెన్ గా రేపు ఒక్క రోజు మాత్రమే ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాలను మూసేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సడెన్ నిర్ణయం వెనుక కారణమేంటో కొంతసేపు ఎవరికీ అర్థం కాలేదు.

కట్ చేస్తే... దీని వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉందని అర్థమైంది. లాక్ డౌన్ కు ఒక్క రోజు ముందు హైదరాబాదుకు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు రేపు ఏపీకి రావడానికి ఇరు రాష్ట్రాల డీజీపీలకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ డీజీపీ వెంటనే అనుమతి పత్రం జారీ చేశారు. కానీ ఏపీ డీజీపీ రెండు రోజులు ఆపి పాస్ జారీ చేశారు. దీంతో హైదరాబాదు నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి ఎల్జీ పాలిమర్స్ బాధితులను కలవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఆవెంటనే ఏపీ నుంచి ఒక విచిత్రమైన నిర్ణయం వెలువడింది. సోమవారం ఒక్కరోజు రెండు ఎయిర్ పోర్టులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. 

దీనిపై తెలుగుదేశం నేత  అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. ఒక్క రోజు ఎయిర్ పోర్టులను మూసేయడం చూస్తుంటే ఇది కేవలం చంద్రబాబును అడ్డుకునే కుట్ర అని అచ్చెన్నాయుడు విమర్శించారు.  సోమవారం విశాఖపట్నం పర్యటనకు చంద్రబాబు కు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడం వైసీపీ ప్రభుత్వ కుట్రగా అచ్చెన్నాయడు ఆరోపించారు. ఎలాగైనా చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చేసిన చిల్లర కుట్ర ఇది అని ఆయన తీవ్ర విమర్శ చేశారు.

ఏ దురుద్దేశం లేకపోతే చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించాకే ఏపీకి విమాన సర్వీసులను ఎందుకు బంద్ చేశారో చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. స్వయంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురి ట్వీట్ దీనికి సాక్ష్యం అన్నారు. ఏపీ ప్రభుత్వం కోరడం వల్లే ఆ రెండు చోటలకు సర్వీసులు రద్దు చేశామని ఆయన ట్వీట్ చేశారన్నారు. 

పలువురు తెలుగుదేశం నేతలు దీనిని తీవ్రంగా తప్పుపడుతూ చంద్రబాబు వస్తాడనే ఎయిర్ పోర్టులు మూసేశారని ఆరోపించారు. ఎవరి అడ్డువచ్చినా చంద్రబాబు యాత్ర ఆగదని రోడ్డు మార్గంలో రావడం వల్ల కేవలం యాత్ర ఒక రోజు ఆలస్యం అవుతుందంటున్నారు.