ట్విట్టరులో స్టార్ హీరోల ఫ్యాన్స్ వార్ హద్దులు దాటింది

April 02, 2020

కోలీవుడ్ స్టార్ హీరోల అభిమానుల అభిమాన పిచ్చ అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఏదైనా త‌ప్పుడు ప‌ని చేస్తున్న‌ప్పుడు వెంట‌నే కంట్రోల్ చేయాల్సిన అవ‌స‌రం స‌ద‌రు స్టార్ హీరోల మీద ఉంది. కానీ.. వారేమీ ప‌ట్ట‌న‌ట్లుగా ఉండ‌టంతో ఫ్యాన్స్ చెల‌రేగిపోతున్న తీరు వికారంగా మారుతోంది.
తాను అభిమానించే హీరోను ఆకాశానికి ఎత్తేయ‌టం త‌ప్పేం కాదు. కానీ.. అదే స‌మ‌యంలో త‌మ ప్ర‌త్య‌ర్థి హీరో గురించి త‌ప్పుడు ప్ర‌చారం త‌ప్పు అయితే.. స‌ద‌రు హీరో చ‌నిపోయారంటూ హ్యాష్ ట్యాగ్స్ క‌ట్టి మ‌రీ సోష‌ల్ మీడియాలో చేస్తున్న వైనం పైశాచిక‌త్వంగా చెప్పాలి. కోలీవుడ్ లో అజిత్.. విజ‌య్ అభిమానుల మ‌ధ్య విభేదాల గురించి తెలిసిందే. ఈ రెండు గ్రూపులు ప్ర‌త్య‌క్షంగా త‌ల‌ప‌డిన సంద‌ర్భాలు బోలెడు. తాజాగా విజ‌య్.. అజిత్ అభిమానుల మ‌ధ్య వికార‌మైన అభిమాన యుద్ధం సాగుతోంది.
ఇటీవ‌ల విజ‌య్ పుట్టిన రోజు (జూన్ 22) వేళ‌.. అజిత్ ఫ్యాన్స్ #June22VijayDeathDay (జూన్‌ 22 విజయ్‌ చనిపోయిన రోజు) అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. అయితే.. దీనికి రెచ్చిపోని విజ‌య్ అభిమానులు హుందాగా స్పందించి #LongLiveAjith అంటూ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. ఇదిలా ఉంటే.. మ‌ళ్లీ ఈ ఇరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య టిట్ట్వ‌ర్ వార్ మ‌ళ్లీ మొద‌లైంది.
తాజాగా అజిత్ ఫ్యాన్స్ #RipVijay అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మార‌టంతో.. ఆయ‌న అభిమానులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అప్ప‌టికి శృతిమించ‌కుండా విజ‌య్ ఫ్యాన్స్ #LongLiveVijay అనే హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్ చేశారే కానీ అజిత్ గురించి మాత్రం త‌ప్పుడు హ్యాష్ ట్యాగ్ ల‌ను స్ప్రెడ్ చేయ‌లేదు. సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రు హీరోల అభిమానులు ఇంత‌లా కొట్టుకుంటున్నా.. స‌ద‌రు న‌టులు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వ్య‌వ‌హారాల మీద స్పందించ‌లేదు. తమ‌ను అభిమానించే వారి పిచ్చి చేష్ట‌ల్ని చూస్తూ ఊరుకునే క‌న్నా.. ఇలాంటివి మంచివి కావ‌న్న మాట‌నైనా చెబితే బాగుండేది.