అఖిల్ ఇలా షాక్ ఇచ్చాడేంటి?

August 09, 2020

హీరోల పుట్టిన రోజులు వ‌చ్చిన‌పుడు మేకింగ్ ద‌శ‌లో ఉన్న వాళ్ల సినిమాల నుంచి అభిమానుల కోసం ఏదో ఒక విశేషాన్ని పంచుకోవ‌డం ఆన‌వాయితీ. సినిమా ఏదీ షూటింగ్ ద‌శ‌లో లేకుంటే కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్ల‌యినా చేస్తారు. బుధ‌వారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేప‌థ్యంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అత‌ను న‌టిస్తున్న కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే రోజు అక్కినేని యువ క‌థానాయ‌కుడు అఖిల్ బ‌ర్త్ డే కూడా. అత‌ను ప్ర‌స్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తుండ‌టంతో దాన్నుంచి కొత్త పోస్ట‌ర్ లేదా టీజ‌ర్ రిలీజ‌వుతుంద‌ని అక్కినేని ఫ్యాన్స్ భావించారు. కానీ వాళ్ల ఆశ‌ల‌పై అఖిల్ నీళ్లు చ‌ల్లాడు.
త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ముందు రోజు అఖిల్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల్ని ప‌ల‌క‌రించాడు. త‌న కొత్త సినిమా నుంచి పోస్ట‌ర్ లేదా టీజ‌ర్ లాంటివేవీ రిలీజ్ చేయట్లేద‌ని.. క‌రోనా వైర‌స్ కార‌ణంగా సంక్షోభ ప‌రిస్థితులు నెల‌కొన‌డ‌మే అందుక్కార‌ణ‌మ‌ని అఖిల్ చెప్పాడు. బుధ‌వారం ఏ విశేషం పంచుకోకూడ‌ద‌న్న‌ది త‌న వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని కూడా అత‌ను వెల్ల‌డించాడు.

సినిమా దర్శ‌క నిర్మాత‌లు అభిమానుల కోసం ఏమైనా రిలీజ్ చేద్దామ‌ని అన్నాడ కూడా.. తానే వ‌ద్ద‌ని ఆపించాన‌ని అఖిల్ తెలిపాడు. పుట్టిన రోజు నాడు త‌న కుటుంబంతో క‌లిసి ఉన్న ఒక అంద‌మైన పిక్ మాత్రం రిలీజ్ చేస్తాన‌ని అత‌ను వెల్ల‌డించాడు. త‌న తొలి మూడు సినిమాలూ డిజాస్ట‌ర్ల‌యిన నేప‌థ్యంలో అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ ప్రొడ‌క్ష‌న్లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు ఈ అక్కినేని కుర్రాడు.