అఖిలేష్ కి ఆస్ట్రాలజీ బిస్కెట్

August 08, 2020

2017 అసెంబ్లీ ఎలక్షన్లలో ఉత్తరప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన అఖిలేష్‌... 2022లో గద్దెనెక్కడానికి జ్యోతిషాన్ని నమ్ముకున్నాడా..? ఆయన కామెంట్లు చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. గత ఎన్నికల్లో... యూపీలో 403 సీట్లకు గాను బీజేపీ టీమ్ ఏకంగా 325 గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ దారుణ పరాభవం మూటగట్టుకుంది. 2012 ఎన్నికల్లో 224 స్థానాల్లో జయకేతనం ఎగరేసిన ఆ పార్టీ... 2017లో కేవలం 47 స్థానాలతో సరిపెట్టుకుంది. ఏకంగా 117 సీట్లు చేజేతులా ప్రత్యర్థి బీజేపీకి సమర్పించుకుని అవమానం పాలైంది. అఖిలేష్‌ హయాంలో, సమాజ్‌వాదీ నేతల అరాచకాలు, అవినీతిపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. మోడీ-షా ద్వయం ఆ మంటలకు ఆజ్యం పోసింది. ఆ నిప్పుతో తన గూట్లో దీపం పెట్టుకుంది.
ప్రత్యర్థి ముందు తలకొట్టేసినట్లయినా ఎస్పీలో అంతర్గత లుకలుకలు ఆగలేదు. తొలుత ఇంట గెలవాల్సిన సారథి అఖిలేష్‌ ఇప్పటికీ ఆ పనిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేయలేదు. ఇప్పుడు కొత్తగా జ్యోతిషాన్ని నమ్ముకున్నారు. 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 350 సీట్లు గెలుస్తామని మీడియా సమావేశం పెట్టిమరీ చెప్పారు. కొన్నిరోజుల క్రితం ఢిల్లీకి  విమానంలో వెళ్తుండగా ఓ జ్యోతిషుడు అఖిలేష్‌ చేయి చూశాడట. నీది మామూలు జాతకం కాదు, వచ్చే ఎన్నికల్లో కుంభస్థలాన్ని కొడతావు, మినిమమ్‌ 350 సీట్లు గ్యారెంటీ అన్నాడట. ఆ మాటతో అఖిలేష్‌ ఛాతీ ఉప్పొంగింది. తన చేయి చూసుకుని మురిసిపోతున్నారు. నిజాయితీతో కష్టపడి పనిచేసి, జ్యోతిషుడు చెప్పినదానింకంటే ఒక స్థానం ఎక్కువే తెచ్చుకుంటామని అన్నారు. అలవాటు లేని పనులు ఎందుకులేగానీ.... ములాయం హయాంలో పార్టీకి పట్టిన బూజును ముందు దుపులు నాయానా అంటూ రాజకీయ విశ్లేషకులు లాస్ట్‌ పంచ్‌ విసురుతున్నారు.