‘అల’ వసూళ్లు అదరగొట్టేస్తున్నాయట..

May 25, 2020

సంక్రాంతి పండక్కి కాస్త ఆలస్యంగా రేసులోకి దిగిన చిత్రం అల వైకుంఠపురములో.  ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త బొమ్మ దానికి భిన్నంగా ఆదివారం ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. ముందుగా డిసైడ్ చేసుకున్న ముహుర్తం.. రాజీ చర్చల కారణంగా కాస్త వెనక్కి వెళ్లినప్పటికి.. కలెక్షన్ల జోరు మాత్రం తగ్గట్లేదు. సంక్రాంతి పండగ సందర్భంగా మూడు రోజులు వరుస సెలవులు కొందరికి వస్తే.. మరికొందరు ఏకంగా వారం సెలవులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు.
పండుగ వేళ పిండి వంటలు ఎంత కామనో.. సంక్రాంతి పండుగ వేళ ఒకటికి రెండు.. మూడు సినిమాలు చూడటం మామూలే. ఈ కారణంగానే వీకెండ్ చివరి రోజున రిలీజ్ అయినా కలెక్షన్ల వర్షం మాత్రం ఆగటం లేదు. దీనికి తోడు విమర్శకుల రివ్యూలు.. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావటంతో టికెట్లు దొరకని పరిస్థితి. వంద శాతం అక్యుపెన్సీతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  
సంక్రాంతి వేళ విడుదలైన సినిమాలతో పోటీ పడుతూ ధీటుగా కలెక్షన్లను రాబడుతోంది. బుధవారం మార్నింగ్ షో.. మ్యాట్నీలతో రూ.100 కోట్ల వసూళ్లను దాటేసిన ఈ చిత్రం మాంచి జోరు మీద సాగుతోంది. ఈ వారాంతంలోనూ సినిమాలేవీ లేకపోవటంతో అల దూకుడు సాగిపోవటం ఖాయమంటున్నారు.
ఇదిలా ఉంటే.. అల వైకుంఠపురములో గ్లోబల్ థియేట్రికల్ హక్కులు రూ.85 కోట్లకు అమ్ముడుపోగా మూడు రోజులు ముగిసేసరికి రూ.61.03 కోట్ల షేర్ వచ్చేసింది. అంటే.. ఇంకో రూ.23.97 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ వచ్చేసినట్లే. ఇప్పుడున్న ఊపు చూస్తే మరో రెండు రోజుల్లో ఆ మొత్తం వసూలు కావటం ఖాయమని.. ఆ తర్వాతదంతా లాభమే లాభమని చెబుతున్నారు. పండుగ వేళ విడుదలైన అల.. ప్రేక్షకులనే కాదు ఈ మూవీ హక్కులు పొందినోళ్లంతా పండుగ చేసుకుంటున్నారని చెప్పక తప్పదు.