బన్నీకి ఇంత తొందరెందుకు?

May 30, 2020

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. తెలుగు ప్రజలకు ఎన్నో థమాకాలు సిద్ధంగా ఉంటాయి. ఊళ్లకు వెళ్లటం.. ఒక పండుగ ఏకంగా మూడు రోజులు సెలవులు ఉండటం.. బంధవులు.. మిత్రుల్నికలిసే వీలు ఉండటంతో పాటు.. తెలుగునాట కోడి పందాలు.. పిండి వంటలతో పాటు పెద్ద హీరోల సినిమాలు పోటాపోటీగా విడుదల కావటం లాంటి వాటితో వాతావరణం సందడిగా ఉంటుంది.
అందుకే మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. సంక్రాంతి వస్తుందంటే చాలు సినిమా నిర్మాతలు తమ సినిమా సంక్రాంతి పండక్కి వచ్చేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఈ సంక్రాంతికి రానున్న పెద్ద సినిమాలకు లోటు లేదు. అయితే.. ఒకేరోజు విడుదల అవుతాయని మహేశ్ సరిలేరు నీకెవ్వరూ.. బన్నీ అల వైకుంఠపురములో.. భావించినా తర్వాత డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవటం తెలిసిందే.
ప్రైవేటు చర్చలతో మహేశ్ మూవీ జనవరి 11న.. బన్నీ సినిమా 12న విడుదల అయ్యేలా అనుకున్నారు. తాజాగా అలవైకుంఠపురముకు వస్తున్న పాజిటివ్ బజ్ నేపథ్యంలో మూవీని రెండు రోజుల ముందు రిలీజ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. పండుగ మంగళవారం వస్తున్న వేళ.. దానికి అల వైకుంఠపురాన్ని ఆదివారం కాకుండా రెండురోజులు ముందు అంటే.. శుక్రవారమే (జనవరి 10) విడుదల చేస్తే బాగుంటుందన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఉన్నట్లుండి రిలీజ్ డేట్ మార్చటం అంత తేలిక కాదు. లాజిస్టిక్స్ పరంగా చాలానే సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వర్క్ వుట్ అవుతాయా? అన్నది క్వశ్చన్. అయితే.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్లే ఈ రోజు పేపర్లలో ఇచ్చిన యాడ్ ను చూసినప్పుడు రిలీజ్ డేట్ ఇవ్వకపోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ డేట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అందుకు భిన్నంగా పండుగ వేళ విడుదల కానున్న అల వైకుంఠపురం.. సరిలేరు నీకెవ్వరు.. దర్బార్.. ఎంత మంచివాడవురా సినిమాల డేట్లు లేకుండా ఈ రోజు ప్రకటనలు రావటం గమనార్హం.
మొత్తంగా చూస్తే.. బన్నీ సినిమా రిలీజ్ డేట్ మారటానికే ఎక్కువ అవకాశం ఉందంటున్నారు.  పన్నెండు నుంచి పదికి రిలీజ్ డేట్ మారితే కలెక్షన్లు భారీగా రావొచ్చన్న మాట వినిపిస్తోంది. మరి.. అధికారికంగా ఈ న్యూస్ ను ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారన్నది క్వశ్చన్ గా మారింది. మొత్తంగా రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు.